కాపు రిజర్వేషన్లపై జగన్, బాబు మధ్య వాగ్వాదం
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. సుధీర్ఘంగా అధికార, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం జరిగింది. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించామని… దానికి జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 2004లో వైఎస్ కూడా కాపులకు హామీ ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన జగన్ మోహన్ రెడ్డి… 2004లో వ్యవహారం ఇప్పుడెందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే తాను ఎన్నికల సమయంలో […]
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. సుధీర్ఘంగా అధికార, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం జరిగింది. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించామని… దానికి జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 2004లో వైఎస్ కూడా కాపులకు హామీ ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇందుకు స్పందించిన జగన్ మోహన్ రెడ్డి… 2004లో వ్యవహారం ఇప్పుడెందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే తాను ఎన్నికల సమయంలో ఏం చెప్పానో దానిపై ప్రశ్నించాలి గానీ… 1983లో ఏం జరిగింది?, 1985లో వెన్నుపోటు ఎలా జరిగింది? అన్న దానిపై చర్చ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏమీ చేయలేదు కాబట్టి పదేపదే 2004 అంటూ వెనక్కు వెళ్లిపోతున్నారన్నారు.
కాపులకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కేటాయిస్తామని 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పారని… కానీ 2015లో వందల కోట్లు కేటాయించి 96 కోట్లు ఖర్చు పెట్టారని… 2016లో ఎన్నికలు వస్తుండడంతో బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని… ఖర్చు మాత్రం 400 కోట్లు చేశారన్నారు. 2017లో వెయ్యి కోట్లు కేటాయించి… 891 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2018 బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించి 525 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇలా కాపులను మోసం చేస్తూ చంద్రబాబు వచ్చారన్నారు.
ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చాను అమలు చేస్తారా? లేదా? అని అడిగే ముందు కనీసం ఆయన మనస్సాక్షి అయినా చంద్రబాబును ప్రశ్నించడం లేదా అని నిలదీశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాంట్లోకి కాపులను ఎలా చేరుస్తారో? చంద్రబాబుకే తెలియాలన్నారు. చంద్రబాబు చేసిన పనికి ఇప్పుడు కాపులు బీసీల్లో ఉన్నారో, ఓసీల్లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈబీసీ రిజర్వేషన్లను కులాల వారీగా పంచిపెట్టే అధికారం ఎవరికీ లేదన్నది రాజ్యాంగంలోనే ఉందన్నారు. చంద్రబాబు చేసిన ఈ పొరపాటు కారణంగానే కోర్టుల్లో పిటిషన్లు నమోదు అయ్యాయని… ఇప్పుడు రిజర్వేషన్ల అమలే ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
చంద్రబాబు ఓట్ల కోసం ఇదే తరహాలో ఎస్సీల వద్ద చిచ్చు పెట్టారన్నారు జగన్. తాను ఏదైనా చెబితే నిజాయితీగానే చేస్తానని వివరించారు. కాపుల గురించి తాను మేనిఫెస్టోలో ఏం చెప్పానో చంద్రబాబు చూసుకోవాలన్నారు.
రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేదు కాబట్టి ముందే హామీ ఇవ్వడం అంటే మోసం చేయడమే అవుతుందని మేనిఫెస్టోలో స్పష్టంగా తాము చెప్పామన్నారు.
కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండువేల కోట్లు చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన తర్వాతే ఎన్నికలకు వెళ్లి తాము గెలుపు సాధించామన్నారు. చెప్పినట్టుగానే కాపులకు బడ్జెట్‌లో రెండు వేల కోట్లు కేటాయించామని… దాన్ని ఖర్చు చేసి కూడా చూపిస్తామన్నారు.
చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై మంజునాథన్ కమిషన్ వేశారని.. చివరకు కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే రిపోర్టు తీసుకున్నారని… అది చెల్లుతుందా? అని జగన్ ప్రశ్నించారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే మంజునాథన్ కమిషన్ రిపోర్టు చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేకుండా చంద్రబాబు చేశారన్నారు.
చంద్రబాబు ఇప్పుటికైనా మారాలని… వయసుతో పాటు నిజాయితీగా వ్యవహరించాలని జగన్ కోరారు.