రాజకీయ లబ్ధి కోసం తండ్రీ కొడుకుల పాకులాట " ఏపీ మహిళా మంత్రులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ మహిళా మంత్రులు సుచరిత, తానేటి వనిత మండిపడ్డారు. “తండ్రీ కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలకైనా దిగజారుతారని వారి మాటలు, చేతలను బట్టి అర్థమవుతోంది” అంటూ మహిళా మంత్రులు సుచరిత, వనిత విడివిడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణానది కరకట్టపై […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ మహిళా మంత్రులు సుచరిత, తానేటి వనిత మండిపడ్డారు.
“తండ్రీ కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలకైనా దిగజారుతారని వారి మాటలు, చేతలను బట్టి అర్థమవుతోంది” అంటూ మహిళా మంత్రులు సుచరిత, వనిత విడివిడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు తనకు భద్రత తగ్గించారంటూ గగ్గోలు పెడుతున్నారని మంత్రి సుచరిత మండిపడ్డారు.
“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతను ప్రభుత్వం తగ్గించ లేదు. నిజానికి గతంలో 58 మంది భద్రతా సిబ్బంది ఉంటే ఆ సంఖ్యను 74కు పెంచాం” అని మంత్రి సుచరిత స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జడ్ ప్లస్ భద్రత ఉందని, అయితే తన భద్రత అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఆయన వాడుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ పై మరో మంత్రి తానేటి వనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడడానికి కూడా భయపడే నారా లోకేష్…. ట్విట్టర్ వేదికగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్స్ ను ట్వీట్లు చేస్తున్నారన్నారు.
“మాజీ మంత్రి నారా లోకేష్ కు తాను పోటీ చేసిన నియోజకవర్గం పేరు చెప్పడం కూడా రాదు. విలేకరుల ముందుకు రావడం అంటేనే భయం” అని మంత్రి వనిత విమర్శించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్స్ లను ట్విట్టర్ ద్వారా ప్రచారం చేయడం, అయిన దానికీ కాని దానికి ప్రభుత్వాన్ని విమర్శించడం నారా లోకేష్ కు తగదని హితవు పలికారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ చేసిన అవినీతి, అక్రమాల కారణంగా ప్రజలు నానా అగచాట్లు పడ్డారని మంత్రి తానేటి వనిత ఆరోపించారు. “గత ప్రభుత్వ అవినీతి, తప్పిదాల కారణంగా వారు అధికారానికి దూరం అయ్యారు. ఆ విషయం మాజీ మంత్రి నారా లోకేష్ గుర్తుంచుకోవాలి” అని మంత్రి వనిత హితవు పలికారు.