తెలుగు రాష్ట్రాల కమలనాథులకు పదవుల పందారం
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం… నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులకు పదవుల యోగం రానున్నది. లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి ముగ్గురు లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో పార్టీ సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డికి స్వతంత్ర హోదాలో మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు బండారు […]
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం… నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులకు పదవుల యోగం రానున్నది.
లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి ముగ్గురు లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో పార్టీ సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డికి స్వతంత్ర హోదాలో మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కు గవర్నర్ గిరి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అండదండలు ఎక్కువగా ఉన్న బండారు దత్తాత్రేయ ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ధీటుగా ఎదగాలంటే సీనియర్ నాయకులకు పదవులు ఇవ్వాలని, దాని ద్వారా ఆయా వర్గాలకు చెందిన వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయాలన్నది కమలనాథుల యోచనగా చెబుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు గవర్నర్ గా ఉన్నారు. కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రి పదవి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ లకు గవర్నర్ పదవులు ఇవ్వడం ద్వారా పార్టీని పటిష్ట పరచవచ్చు అన్నది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచాలంటే అక్కడి నాయకులకు కూడా పదవులు కట్టబెట్టాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గోదావరి జిల్లాలకు చెందిన రామారావుకు ఆర్ఎస్ఎస్ అండదండలున్నాయి. బీజేపీ సీనియర్ నాయకులు కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, సోము వీర్రాజులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు పదవులు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు అన్నది కమలనాథుల యోచనగా తెలుస్తోంది.