2019 వన్డే ప్రపంచకప్ లో పరుగుల వెల్లువ ఖాయం
బ్యాట్స్ మన్ స్వర్గధామంగా మారిన ఇంగ్లండ్ వికెట్లు 300 స్కోర్ల చేజింగ్ ఏమంత కష్టంకాదంటున్న రికార్డులు 2015 ప్రపంచకప్ తర్వాత అలవోకగా 300కు పైగా స్కోర్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో పరుగుల సునామీ తప్పదని క్రికెట్ పండితులు మాత్రమే కాదు…బ్రిటీష్ వికెట్లపై రికార్డులు సైతం చెప్పకనే చెబుతున్నాయి. బౌలర్లకు పరీక్షాసమయమేనని అంటున్నారు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అంటే… ఫాస్ట్, సీమింగ్ పిచ్ […]
- బ్యాట్స్ మన్ స్వర్గధామంగా మారిన ఇంగ్లండ్ వికెట్లు
- 300 స్కోర్ల చేజింగ్ ఏమంత కష్టంకాదంటున్న రికార్డులు
- 2015 ప్రపంచకప్ తర్వాత అలవోకగా 300కు పైగా స్కోర్లు
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో పరుగుల సునామీ తప్పదని క్రికెట్ పండితులు మాత్రమే కాదు…బ్రిటీష్ వికెట్లపై రికార్డులు సైతం చెప్పకనే చెబుతున్నాయి. బౌలర్లకు పరీక్షాసమయమేనని అంటున్నారు.
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అంటే… ఫాస్ట్, సీమింగ్ పిచ్ లు మాత్రమే ఉండేవి. అయితే…గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి పిచ్ లు సైతం ఫ్లాట్ వికెట్లుగా మారిపోయాయి. పరుగులు వెల్లువెత్తడం, 300కు పైగా స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణంగా మారిపోయాయి.
ప్రపంచకప్ లో సైతం…
300 లేదా 350కి పైగా స్కోర్లు సాధించినా…విజయానికి ఏ మాత్రం గ్యారెంటీ లేదని వివిధ జట్లు భావిస్తున్నాయి. బ్రిస్టల్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన మూడో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 359 పరుగుల టార్గెట్ ను అలవోకగా సాధించడం చూస్తే…ప్రపంచకప్ మ్యాచ్ ల్లో పరుగుల సునామీ తప్పదని తేలింది.
469 వన్డేల్లో 128 సార్లు 300కు పైగా స్కోర్లు…
2015 ప్రపంచకప్ ఫైనల్స్ నుంచి ప్రస్తుత ఇంగ్లండ్- పాక్ సిరీస్ వరకూ జరిగిన మొత్తం 469 వన్డే మ్యాచ్ ల్లో…300కు పైగా స్కోర్లు 128 సార్లు నమోదయ్యాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే 300కు పైగా స్కోర్లు సాధించాయి.
ఈ 128 మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగి 300కు పైగా స్కోర్లు సాధించిన జట్లు 77 శాతం మాత్రమే సఫలమయ్యాయి.
మిగిలిన 23 శాతం విజయాలు.. చేజింగ్ లో నమోదు కావడం విశేషం.
400 స్కోర్లే సేఫ్….
మొత్తం 341 మ్యాచ్ ల్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న జట్లు 300 కంటే తక్కువ స్కోర్లు సాధించగలిగాయి. 130 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి. 300 కంటే తక్కువ స్కోర్లు సాధించిన సమయంలో 38 శాతం విజయాలు మాత్రమే నమోదయ్యాయి.
201 మ్యాచ్ ల్లో 250 స్కోర్లు, 140మ్యాచ్ ల్లో 250 నుంచి 299 వరకూ స్కోర్లు, 87 మ్యాచ్ ల్లో 300 నుంచి 349 స్కోర్లు, 36 వన్డేల్లో 350 నుంచి 399 పరుగుల స్కోర్లు, కేవలం ఐదుమ్యాచ్ ల్లో మాత్రం 400 స్కోర్లు నమోదయ్యాయి.
400 స్కోర్లు నమోదు చేసిన సమయంలో మాత్రమే నూటికి నూరుశాతం విజయాలు ఉండటం విశేషం.
ఇంగ్లండ్ లో అలవోకగా 300 టార్గెట్ చేజింగ్…
ఇంగ్లండ్ గడ్డపై గత ఐదేళ్ల కాలంలో…జరిగిన మొత్తం 56 వన్డేల్లో…18సార్లు 300కు పైగా టార్గెట్ లను వివిధ జట్లు అందుకోడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో ఆడిన మొత్తం వన్డేలలో వరుసగా 16 చేజింగ్ విజయాలు సాధించడం విశేషం.
అంతేకాదు…ఇంగ్లండ్ 400కు పైగా స్కోర్లను ఐదుసార్లు నమోదు చేసిన సమయంలో మూడుసార్లు విజేతగా నిలిచింది. నాటింగ్ హామ్, బ్రిస్టల్ వేదికలుగా జరిగే మ్యాచ్ ల్లో ప్రపంచ రికార్డు చేజింగ్ స్కోర్లు నమోదైనా ఆశ్చర్యపోనక్కరలేదు.
జూన్ 5న బ్రిస్టల్ వేదికగా భారత్, సౌతాఫ్రికాజట్ల మధ్య జరిగే మ్యాచ్ ల్లో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
బ్యాట్స్ మన్ స్వర్గధామం బ్రిస్టల్ పిచ్ పై 400 స్కోర్లు చేధించడం ఏమంత కష్టం కాదని కూడా క్రికెట్ పండితులు చెబుతున్నారు.