సప్తఖండాల మారథాన్ వీరుడు

49 ఏళ్ల వయసులోనూ పరుగే పరుగు పరుగుకు వయసు అవరోధం కాదంటున్న అదిల్ 26 మైళ్ల పరుగు మారథాన్ లో పాల్గొనాలంటే వయసులో ఉన్న యువకులే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే..ఢిల్లీకి చెందిన 49 ఏళ్ల రన్నర్ అదిల్ నర్గోల్ వాలా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మారథాన్, హాఫ్ మారథాన్ రేస్ ల్లో పాల్గొంటూ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ భూగోళంలోని ఏడు ఖండాల గడ్డపైన మారథాన్ రేస్ లు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. […]

Advertisement
Update:2019-04-29 02:58 IST
  • 49 ఏళ్ల వయసులోనూ పరుగే పరుగు
  • పరుగుకు వయసు అవరోధం కాదంటున్న అదిల్

26 మైళ్ల పరుగు మారథాన్ లో పాల్గొనాలంటే వయసులో ఉన్న యువకులే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే..ఢిల్లీకి చెందిన 49 ఏళ్ల రన్నర్ అదిల్ నర్గోల్ వాలా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మారథాన్, హాఫ్ మారథాన్ రేస్ ల్లో పాల్గొంటూ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ భూగోళంలోని ఏడు ఖండాల గడ్డపైన మారథాన్ రేస్ లు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

అదిల్ నర్గోల్ వాలా….మనదేశంలో మారథాన్ పరుగుకు మరో పేరు. 49 ఏళ్ల లేటు వయసులోనూ అంతర్జాతీయ మారథాన్ రేస్ ల్లో పాల్గొంటున్న భారత ఏకైక పరుగు వీరుడు.

మూడేళ్ల క్రితమే ఢిల్లీలోని ఓ అంతర్జాతీయ రిక్రూట్ మెంట్ కన్ సల్టెన్సీ అధినేతగా పనిచేసిన సమయంలో అదిల్ కు పరుగంటే మక్కువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాలలో జరిగే పరుగు, అంతర్జాతీయ మారథాన్ రేస్ ల గురించి అవగాహన పెంచుకోడం మొదలు పెట్టారు.

ఫిట్ నెస్సే ఊపిరి…

అదిల్ కు బాల్యం నుంచి ఫిట్ నెస్ అంటే ఎంతో మక్కువ. దైనందిన జీవితంలో సైక్లింగ్ ను ఓ భాగంగా చేసుకొన్నారు. రెండురోజులకోసారి 50 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కటం ఓ అలవాటుగా మార్చుకొన్నారు. అంతేకాదు. నెలకు ఓసారి 100 కిలోమీటర్ల సైకిల్ రేస్ లో పాల్గొంటూ వస్తున్నారు.

2009లో ఢిల్లీ నుంచి జైపూర్ వరకూ 250 కిలోమీటర్ల దూరం సైకిల్ రేస్ ను 12 గంటల సమయంలో పూర్తి చేసి …వారేవ్వా అనిపించుకొన్నారు.ఆ తర్వాత రెండేళ్లకు సముద్ర మట్టానికి 16వేల అడుగుల ఎత్తున జరిగిన మనాలీ- లే సైక్లింగ్ రేస్ లో సైతం పాల్గొన్నారు.

2014లో ఢిల్లీ నుంచి పాకిస్థాన్ సరిహద్దులోని వాఘా వరకూ 600 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.

సైక్లింగ్ నుంచి మారథాన్ కు….

అంతర్జాతీయ మారథాన్ రేస్ ల గురించి తన కంపెనీ ద్వారా అవగాహన కల్పిస్తూ వచ్చిన అదిల్ కు … మారథాన్ పరుగులో పాల్గొనాలన్న ఆలోచన వచ్చింది. 2009లో తొలిసారిగా మారథాన్ పరుగుకు సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకొన్నారు.

ఆ తర్వాత హాఫ్ మారథాన్ రేస్ ల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొన్నారు. పూణే, ముంబై నగరాలలో జరిగిన అంతర్జాతీయ హాఫ్ మారథాన్ రేస్ ల్లో పాల్గొనటం ద్వారా… పరుగుపై మక్కువను మరింతగా పెంచుకొన్నారు. క్రమంగా పూర్తిస్థాయి మారథాన్ రేస్ ల్లో పాల్గొనే సాహసం చేశారు.

మారథాన్ పరుగు అంటే 26 మైళ్ల 385 అడుగులు లేదా 42 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అదీ 45ఏళ్లకు పైబడిన వయసులో పరుగెత్తడం అంటే సాహసమే అనుకోవాలి.

అయితే.. కుటుంబసభ్యుల ప్రోత్సాహానికి ఆత్మవిశ్వాసాన్ని జత చేసుకొని…న్యూయార్క్, చికాగో, లండన్, బెర్లిన్, బోస్టన్, టోక్యో అంతర్జాతీయ మారథాన్ రేస్ ల్లో పాల్గొనటమేకాదు…మొత్తం దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఆరో భారత రన్నర్ అదిల్…

ప్రపంచంలోని ఆరు ప్రముఖ అంతర్జాతీయ మారథాన్ రేస్ ల్లో పాల్గొన్న ఏడో భారతీయుడిగా అదిల్ గుర్తింపు తెచ్చుకొన్నారు. 2015 జూలై నుంచి 2016 జూన్ 30 మధ్య కాలంలో 39 మారథాన్ రేస్ ల్లో పాల్గొని సంచలనం సృష్టించారు.

47 సంవత్సరాల వయసుకే 28 మారథాన్ రేస్ ల్లో పాల్గొన్న ఘనత సాధించారు, అంతటితోనే ఆగిపోకుండా…ప్రపంచంలోని ఏడు ఖండాలలో జరిగే మారథాన్ రేస్ ల్లో పాల్గొనాలని నిర్ణయించారు.

మంచుఖండం అంటార్కిటికాలో నిర్వహించిన వైట్ కాంటినెంట్ మారథాన్ పరుగులో పాల్గొనడం తనకో సవాలని…ఎముకలు కొరికే చలివాతావరణంలో పరుగెత్తడం జీవితకాల అనుభవమని, ఒకదశలో ఊపిరి అందని స్థితిలోనూ పరుగు కొనసాగించడమే కాదు…రేస్ మొత్తం దూరాన్ని పూర్తి చేయడం గర్వకారణమని అదిల్ పొంగిపోతున్నారు.

దక్షిణ అమెరికాలోని చిలీలో నిర్వహించిన పుంటా ఎరీనాస్ అంతర్జాతీయ మారథాన్, ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ మారథాన్, ఆఫ్రికాఖండంలోని కిలిమంజారో మారథాన్, ఆసియా, యూరోప్ ఖండాలలోని వివిధ మారథాన్ రేస్ ల్లో పాల్గొనడం ద్వారా…2016 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు.

అంకితభావం, ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే…వయసు ఏమాత్రం అవరోథం కాదనటానికి నిదర్శనమే 49 ఏళ్ల మారథాన్ పరుగువీరుడు అదిల్ నర్గోల్ వాలా. ఐదు పదుల వయసులోనూ అదిల్ పరుగెత్తాలని…మరిన్ని అరుదైన రికార్డులు సాధించాలని కోరుకొందాం.

Tags:    
Advertisement

Similar News