ఏపీలో 'దేశం' వర్సెస్ సి.ఎస్ !
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వ్యవహారాలు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ల కంటే రంజుగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సిన తెలుగుదేశం పెద్దలు ఇంకా అధికారం తమదేనన్న భ్రమలో ఉన్నారని అధికారులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాలేదు కాబట్టి ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత తమదేనని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప అంత వరకు అధికారంలో ఉన్న వారికి ఎటువంటి పాలనాధికారాలు […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వ్యవహారాలు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ల కంటే రంజుగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సిన తెలుగుదేశం పెద్దలు ఇంకా అధికారం తమదేనన్న భ్రమలో ఉన్నారని అధికారులు అంటున్నారు.
ఎన్నికల ఫలితాలు రాలేదు కాబట్టి ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత తమదేనని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప అంత వరకు అధికారంలో ఉన్న వారికి ఎటువంటి పాలనాధికారాలు ఉండవని ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి.
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో సహా కొంతమంది అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఈ బదిలీల అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఎన్నికల కమిషన్.
పాలనా వ్యవహారాలలో అత్యంత సీనియర్, అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం…. ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చులపై వివరాలు సేకరిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏ పథకాలకు ఎంత పంపించారు, వాటిని ఏ పథకాలకు దారి మళ్ళించారు వంటి అంశాలపై అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఈ చర్యలు ఆపద్ధర్మ ప్రభుత్వం లోని మంత్రులకు కంటగింపుగా మారింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ కార్యదర్శి ఆరా తీయడం ఏమిటంటూ ఆపద్ధర్మ మంత్రులు మండిపడుతున్నారు. జమా ఖర్చులను తెలుసుకునే అధికారం కానీ, ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించడం గాని చేయకూడదంటూ మంత్రులు వాదిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశాలు నిర్వహించడాన్ని…. మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రుల వాదన సరైంది కాదంటూ ఉన్నతాధికారులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా అంటున్నారు.
రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో పాలనా వ్యవహారాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ళ పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి తెలీదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆపద్ధర్మ మంత్రులుగా ఉన్న వారు గతంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలపై మింగలేక కక్కలేక తెలుగుదేశం నాయకులు, మంత్రులు లోలోన మదన పడుతున్నారు.