ఈ సమీక్షలేమిటి చంద్రబాబు : అధికారుల ఆగ్రహం..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలాల్సి ఉంది. మే 23 వ తేదీన ఫలితాలు వెలువడే వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందనేది అటు రాజకీయ పార్టీల వారికి, ఇటు ప్రజలకి గుర్తెరిగిన అంశం. రాష్ట్రానికి విపత్తులు ఏమైనా సంభవించినప్పుడూ, ఊహించని నష్టం జరిగినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలాల్సి ఉంది. మే 23 వ తేదీన ఫలితాలు వెలువడే వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందనేది అటు రాజకీయ పార్టీల వారికి, ఇటు ప్రజలకి గుర్తెరిగిన అంశం.
రాష్ట్రానికి విపత్తులు ఏమైనా సంభవించినప్పుడూ, ఊహించని నష్టం జరిగినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందంటున్నారు.
సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు అధికారులందరూ ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే పనిచేయాలని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తమ తీరు మారిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో సమీక్షలు చేయకూడదని తెలిసినా మొండి పట్టుదలతో చంద్రబాబు నాయుడు తమను పిలిపించుకుని ఆదేశాలు జారీ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
వేసవిలో ప్రజలకు మంచినీటి సౌకర్యం కానీ, మునిసిపాలిటీల్లో పారిశుధ్య సమస్యలు గానీ ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించి సమీక్షించాల్సిన అవసరం ఉండదని, ఈ పనులు ఎప్పటిలాగే జరిగిపోతాయని వారు అంటున్నారు.
ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు “అదొక ప్రాసెస్. ఎన్నికల తర్వాత జరిగే ఓ ప్రక్రియ. దానికి సమయం అంటూ ఉండదు” అని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు…. నిత్యావసరాల పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కూడా ఓ ప్రాసెస్ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియదా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు.