క్రాస్ ఓటింగ్ తో గెలుస్తామా? అభ్యర్ధుల ఆశలు...!
“చాలా నియోజక వర్గాలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది మనల్ని గట్టెక్కిస్తుంది” ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థుల దింపుడు కళ్లెం ఆశ ఇది. ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి ఖరారైందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్త ఆశల వైపు పరుగులు తీస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు. అందులో ఒకటి ఈ క్రాస్ ఓటింగ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలకు, 175 శాసనసభ […]
“చాలా నియోజక వర్గాలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది మనల్ని గట్టెక్కిస్తుంది” ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థుల దింపుడు కళ్లెం ఆశ ఇది. ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి ఖరారైందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్త ఆశల వైపు పరుగులు తీస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు. అందులో ఒకటి ఈ క్రాస్ ఓటింగ్ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సభలకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీఎంల్లో ఏది దేనికో తెలియక ఓటర్లు కంగారు పడ్డారని తెలుగుదేశం అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ఈ కంగారులో భాగంగా తాము వేయాల్సిన రెండు ఓట్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి, తెలుగుదేశం పార్టీకి మరొకటి వేసినట్లుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు భావిస్తున్నారు.
ఇలా క్రాస్ ఓటింగ్ జరిగిన చోట్ల శాసనసభకు తెలుగుదేశం పార్టీకి, లోక్ సభకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయని వారు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఎన్నికలు జరిగిన వారం రోజుల నుంచి ఈవీఎంలు సరిగా పని చేయలేదని, ఒక గుర్తుకు ఓటు వేస్తే మరొక గుర్తుపై పడిందంటూ ఆరోపణలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కొత్తగా ఈ క్రాస్ ఓటింగ్ పై అశలు పెంచుకున్నారని అంటున్నారు.
లోక్ సభకు, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఓటర్లలో స్పష్టత లేకుండా పోయిందని, ఇది తమకు ఉపకరిస్తుందని పార్టీ అభ్యర్థుల అంచనా. అయితే ఓటర్లలో మాత్రం విజ్ఞత ఉందని, ఓటు ఎవరికి వేస్తున్నారో వారికి స్పష్టంగా తెలుసునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో అనేక సార్లు ఇలా రెండు సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, ఆ సమయంలో కూడా ఓటు వేయడంలో వారు ఎలాంటి తడబాటు చెందలేదని చెబుతున్నారు. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు… క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని కొత్త ఆశలు పెంచుకుంటున్నారని చెబుతున్నారు.
తెలుగుదేశం అభ్యర్ధులు భావించినట్లుగా క్రాస్ ఓటింగ్ జరిగినా శాసనసభకు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని మరికొందరు చెబుతున్నారు. అదే జరిగితే లోక్ సభకు పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులు మరికొంతమంది విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.