పెన్షనర్స్‌కి 496 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఏపీ ప్రభుత్వం
అందరికీ పెన్షన్లు పెంచుతాం…. కొత్తగా పెన్షన్లు ఇస్తాం…. అంటూ ఎలక్షన్ వాగ్దానాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్లను మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదు. చట్టబద్దంగా ఇవ్వాల్సిన పెన్షన్లలో 496 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఎగ్గొట్టింది. వివరాల్లోకి వెళితే…. తొమ్మిదవ ‘పే రివిజన్ కమిషన్’ ప్రతిపాదించిన ‘అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్’ ను ఎపీ ప్రభుత్వం అంగీకరించి జీవో ఎం.ఎస్.నెం.100 ను విడుదల చేసింది. దాని ప్రకారం పెన్షన్ తీసుకునే వ్యక్తి లేదా […]
అందరికీ పెన్షన్లు పెంచుతాం…. కొత్తగా పెన్షన్లు ఇస్తాం…. అంటూ ఎలక్షన్ వాగ్దానాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్లను మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదు. చట్టబద్దంగా ఇవ్వాల్సిన పెన్షన్లలో 496 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఎగ్గొట్టింది. వివరాల్లోకి వెళితే….
తొమ్మిదవ ‘పే రివిజన్ కమిషన్’ ప్రతిపాదించిన ‘అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్’ ను ఎపీ ప్రభుత్వం అంగీకరించి జీవో ఎం.ఎస్.నెం.100 ను విడుదల చేసింది. దాని ప్రకారం పెన్షన్ తీసుకునే వ్యక్తి లేదా వారసుల వయసు 75 ఏళ్ళు దాటగానే అప్పటి దాకా వస్తున్న పెన్షన్‌కు మరో 15 శాతం కలిపి ఇవ్వాలి. 80 ఏళ్ళు దాటగానే మరో 5 శాతం, 85 ఏళ్ళు దాటగానే మరో 5 శాతం…. ఇలా ప్రతి ఐదేళ్ళకు 5 శాతం పెన్షన్ పెంపుదల జరగాలి.
అయితే ఉద్యోగి బ్రతికి ఉంటే…. వాళ్ళందరూ ఈ పెరిగిన పెన్షన్‌ను అందుకుంటున్నారు. ఉద్యోగి చనిపోయినప్పుడు ఉద్యోగి వారసులు…. భార్య గానీ భర్త గానీ వాళ్ళ వయసు 75 దాటగానే ఈ జీవో ప్రకారం వాళ్ళకు కూడా ప్రతి ఐదేళ్ళకూ 5 శాతం పెన్షన్ పెంపుదల ఉండాలి. కానీ అలా పెంచడం లేదు. దానికి కారణం ప్రభుత్వం వారసుల వయసును సరిగ్గా నమోదు చేయకపోవడమే. ఉద్యోగి వారసుల వివరాలు, వాళ్ళ వయసు సర్వీస్ రిజిస్టర్ లో ఉంటుంది. వాళ్ళ వయసును నమోదు చేయడంలో కావాలని తప్పిదాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పెన్షనర్స్ సుమారు 3 లక్షల 45 వేల మంది ఉంటే…. వాళ్ళల్లో ఫ్యామిలీ పెన్షనర్స్ సుమారు 90 వేల మంది. ఈ 90 వేల మంది పుట్టిన తేదీలు సక్రమంగా నమోదు చేయడం లేదు.
వీళ్ళల్లో సుమారు 24 వేల 300 మందికి వాళ్ళ వయసును పెన్షన్ రికార్డుల్లో “0” గా నమోదు చేశారు. ఒక వ్యక్తికి సున్నా వయసు ఎలా ఉంటుందో ప్రభుత్వానికే తెలియాలి. వీళ్ళకు కూడా 75 సంవత్సరాల వరకు పెన్షన్ సక్రమంగానే వస్తోంది. వాళ్ళలో కొందరి వయసు 75 దాటగానే కంప్యూటర్ రికార్డుల్లో వాళ్ళ వయసు ”0” గా మారిపోతోంది. దాంతో పెరిగిన పెన్షన్ రాకుండా పాత పెన్షనే వస్తోంది. ఇలా చేయడంతో 2018 డిసెంబర్ వరకు వాళ్ళకు రావాల్సిన పెరిగిన పెన్షన్ 365 కోట్లు వాళ్ళకు అందలేదు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగి వారసుల పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోతే 1. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ 2. పాన్ కార్డ్ 3. పాస్‌పోర్ట్ 4. డ్రైవింగ్ లైసెన్స్ 5. ఓటర్ ఐడీ కార్డ్ 6. మెడికల్ సర్టిఫికేట్…. ఈ ఆరింటిలో ఏదో ఒక దాని ఆధారంగా వాళ్ళ వయసును నమోదు చేయమని చట్టం చెబుతోంది.
అయితే ఏపీ ప్రభుత్వం వాళ్ళ వయసును సక్రమంగా నమోదుచేసే ప్రయత్నమేమీ చేయడం లేదు. దానికి కారణం ఈ ఆర్ధిక భారం నుంచి తప్పుకోవడానికే.
మరో 4,500 మంది ఫ్యామిలీ పెన్షనర్స్‌కు రికార్టుల్లో వాళ్ళ పుట్టిన తేదీ సక్రమంగా ఉన్నా, వాళ్ళ వయసు 75 ఏళ్ళు దాటినా…. పెన్షన్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ వయస్సును చాలా తక్కువగా వేసి పెరగాల్సిన పెన్షన్‌ను ఎగ్గొడుతున్నారు.
అలా నష్టపోయిన ఈ 4,500 మందికి సుమారు 68 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
మరో 6,300 మందికి పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నా 95 ఏళ్ళ వాళ్ళకు 90….. 85 ఏళ్ళ వాళ్ళకు 80…. ఇలా నమోదు చేసి వాళ్ళకు రావాల్సిన 5 శాతం పెంపుదలను ఎగ్గొడుతున్నారు. అలా నష్టపోయిన 6,300 మందికి ప్రభుత్వం నుంచి సుమారు 63 కోట్ల రూపాయలు రావాలి.
అలా మొత్తంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కు ప్రభుత్వం నుంచి సుమారు 496 కోట్ల రూపాయలు రావాలి. కానీ ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షనర్ల వయసు నమోదులో జిమ్మిక్కులు చేస్తూ ఈ డబ్బులు ఎగ్గొడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 15 కల్లా ఈ మొత్తం బకాయిలను ఫ్యామిలీ పెన్షనర్స్‌కు చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు.