చంద్రబాబు సైబర్ క్రైం చేశారు : వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత తీవ్రమైన సైబర్ క్రైంకి పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీకి చెందిన 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అనధికారికంగా ఇచ్చేశారని ఆయన చెప్పారు. ‘డేటా చోరీ’ వ్యవహారంపై బుధవారం సాయంత్రం జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలసి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహ్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తికి […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత తీవ్రమైన సైబర్ క్రైంకి పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీకి చెందిన 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అనధికారికంగా ఇచ్చేశారని ఆయన చెప్పారు. ‘డేటా చోరీ’ వ్యవహారంపై బుధవారం సాయంత్రం జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలసి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహ్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్, బ్యాంకు అకౌంట్లు, ఓటర్ ఐడీ వివరాలన్నీ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఉన్నాయని జగన్ ప్రశ్నించారు. జిరాక్స్ కాపీలలాంటివి కాక.. ఏకంగా మాస్టర్ కాపీలు ఆ ప్రైవేటు సంస్థ దగ్గర ఉన్నాయని… ఇవన్నీ చంద్రబాబు చేయించిన సర్వేల ద్వారా లభ్యమైన వివరాలే అని జగన్ ఆరోపించారు. సేవామిత్ర అనే యాప్‌లో ఇలాంటి వివరాలన్నీ క్రోడీకరించి టీడీపీ కార్యకర్తలకు ట్యాబ్‌లో అందుబాటులో ఉంచారని జగన్ అన్నారు.
ఈ వివరాల ఆధారంగా గత రెండేళ్లుగా సదరు టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తూ.. అనుకూలంగా ఉన్నవారికి మాత్రం డబుల్ ఓట్లు సృష్టించారని జగన్ చెప్పారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల ద్వారా చేయించిందని జగన్ ఆరోపించారు.
ఇలా లక్షలాది ఓట్లు తొలగించారని జగన్ చెప్పారు. గత ఎన్నికల్లో మేం 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం.. అందుకే ఈ దఫా ఈ దొంగ ఓట్లను చాలా తీవ్రంగా పరిగణించి ఎన్నికల కమిషన్‌కు కూడా పిర్యాదు చేశామని ఆయన చెప్పారు. దాదాపు 56 లక్షల దొంగ ఓట్ల గురించిన ఆధారాలు ఉన్న 23 పెన్ డ్రైవ్‌లను కోర్టులు, సంబంధిత శాఖలకు కూడా అందించామన్నారు.
ఇలా టెక్నాలజీని ఉపయోగించుకొని అసలైన ఓట్లను తొలగిస్తూ.. దొంగ ఓట్లను చేర్చడం.. వ్యక్తిగత డిజిటల్ వివరాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కచ్చితంగా సైబర్ క్రైం అని జగన్ స్పష్టం చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ అని ఆయన వివరించారు.
దీనిపై వెంటనే స్పందించి… సరైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని జగన్ చెప్పారు.