ఏపీలో ముందస్తు మద్యం!!!
రాజకీయాలలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి. ముందస్తుగా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. ముందస్తుగా సిద్ధమవుతున్న ప్రయాణాలు కూడా ఉంటాయి. ఎక్సైజ్ శాఖ ఒకటి రెండు రోజులు సెలవు ప్రకటిస్తే ముందుగా ఒకటి రెండు బాటిల్ కొనుక్కునే ముందస్తు జాగ్రత్తలు కూడా ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ముందస్తు మద్యం పథకం నడుస్తోంది. ఇందులో భాగంగా మద్యం కార్టన్లు రహస్య డిపోల్లోకి , బెల్టు షాపుల్లోకి, తెలుగు తమ్ముళ్ల ఇళ్లల్లోకి సరఫరా అవుతోందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ […]
రాజకీయాలలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి. ముందస్తుగా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. ముందస్తుగా సిద్ధమవుతున్న ప్రయాణాలు కూడా ఉంటాయి. ఎక్సైజ్ శాఖ ఒకటి రెండు రోజులు సెలవు ప్రకటిస్తే ముందుగా ఒకటి రెండు బాటిల్ కొనుక్కునే ముందస్తు జాగ్రత్తలు కూడా ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ముందస్తు మద్యం పథకం నడుస్తోంది. ఇందులో భాగంగా మద్యం కార్టన్లు రహస్య డిపోల్లోకి , బెల్టు షాపుల్లోకి, తెలుగు తమ్ముళ్ల ఇళ్లల్లోకి సరఫరా అవుతోందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మరో వారం పది రోజులు గడువు ఉందని వార్తలు రావడంతో ఏపీలోని రాజకీయ పార్టీలు ముందస్తుగా మద్యాన్ని నిలువ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమే అన్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కలు ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు ముందస్తు మద్యం సేకరణకు నడుం భిగించినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మద్యం అమ్మకాలు నియంత్రణకు లోబడి జరగాలి. ఇందులో ప్రధానంగా సంవత్సరంలో నెలలో ఒక తేదీన ఎంత మద్యాన్ని విక్రయించారో.. అదే పరిమాణంలో ఎన్నికల సమయంలో కూడా విక్రయించాల్సి ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ విక్రయిస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తారు. గత జనవరి నెలలో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నెలలో ఏడు శాతం లిక్కర్, 23 శాతం బీరు అమ్మకాలు అధికంగా విక్రయించినట్లు మద్యం డిపోలు నుంచి అందిన సమాచారం.
28 రోజులు మాత్రమే ఉన్న ఫిబ్రవరి నెలలో వందల కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించినట్లుగా డిపోలో లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 33. 4 లక్షల కేసుల లిక్కర్, 27 లక్షల కేసుల బీర్లు డిపోల నుంచి సరఫరా అయినట్లు అధికారిక లెక్క. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 500 కోట్లు ఎక్కువ ఉంది అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ రావడానికి మరో వారం రోజులు గడువు ఉండడంతో ఈ వారం రోజుల్లోనే కనీసం రెండు వేల కోట్ల రూపాయల మద్యాన్ని “తమ్ముళ్లు” కొందరు కొనుగోలు చేసి సురక్షిత ప్రాంతాలకు పంపే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేసే “తమ్ముళ్లు” అందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు… కాదు కాదు “మందస్తు” సన్నాహాలకు తెర తీస్తున్నారు.