టీడీపీ మీడియా ఉలికిపాటు
ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ప్రజల డేటా మొత్తం ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లడం సంచలనంగా మారింది. టీడీపీ, ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే సంస్థ కలిసి ఏపీలో ఓట్ల తొలగింపు కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ సైబర్ బజార్‌లో పడ్డాయి. పల్స్ సర్వే సమయంలో సేకరించిన బ్యాంకు అకౌంటు నెంబర్లు కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆధార్, ఫోన్ నెంబర్, కలర్ ఫోటో, ఆర్థిక […]
ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ప్రజల డేటా మొత్తం ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లడం సంచలనంగా మారింది. టీడీపీ, ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే సంస్థ కలిసి ఏపీలో ఓట్ల తొలగింపు కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ సైబర్ బజార్‌లో పడ్డాయి.
పల్స్ సర్వే సమయంలో సేకరించిన బ్యాంకు అకౌంటు నెంబర్లు కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆధార్, ఫోన్ నెంబర్, కలర్ ఫోటో, ఆర్థిక సామర్ధ్యం ఇలా ప్రతి అంశం ఈ సంస్థకు అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. దీనిపై ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు సంస్థ గుట్టు రట్టు చేశారు. డేటా చోరీ నిజమేనని తేల్చారు. ఓట్ల తొలగింపు ప్రధాన లక్ష్యంగా ఈ డేటాను వాడుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే అటు టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరు ఆసక్తిగా ఉంది.
టీడీపీకి ఈ వ్యవహారానికి సంబంధం లేకపోతే టీడీపీ అనుకూల రెండు పత్రికలు మరీ ఈస్థాయిలో స్పందించేవా అన్న అనుమానం కలిగేలా ఆ రెండు పత్రికల్లో కథనాలు ఉన్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే…. అదేదో కొంపలు మునిగిపోయే అంశంగా రియాక్ట్ అయ్యాయి. ఈ రెండు పత్రికలు కూడా హైడ్రామా అంటూ హెడ్‌లైన్లు పెట్టేశాయి.
ఈ రెండు పత్రికలు టీడీపీ కోసం పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కథనాలు రాశాయే గానీ… మూడున్నర కోట్ల మంది ప్రజల డేటా దొంగతనం గురించి మాత్రం పెద్దగా ప్రస్తావించకుండా బాగానే జాగ్రత్తపడ్డాయి.
టీడీపీ అనుకూల రెండో పత్రిక మరో అడుగు ముందుకేసింది. నెలలు తరబడి వైసీపీ వాళ్లు తమ ఓట్లు గల్లంతు అయ్యాయని ఆందోళన చెందుతుంటే ఇంతకాలం మౌనంగా ఉన్న మీడియా… ఇప్పుడు డేటా కుంభకోణం బయటపడే సరికి ఎదురుదాడి కథనాలు రాసింది. వైసీపీ వాళ్లే టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని బ్యానర్ కథనాన్ని టీడీపీ రెండో పత్రిక ప్రచురించింది.
టీడీపీ ఓట్ల తొలగింపుకు భారీకుట్ర అంటూ కథనాన్ని రాసింది. ఈ వైఖరి బట్టి చూస్తుంటే డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ పాత్ర స్పష్టంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇది ఎంతటి సీరియస్ అంశం అన్నది టీడీపీ అనుకూల మీడియా హైరానా చూస్తేనే అర్థమవుతోంది.