హైదరాబాద్ లో ఐదేళ్ల తర్వాత తొలివన్డే

గత 14 సంవత్సరాలలో ఐదు వన్డేలకు ఆతిథ్యం రాజీవ్ స్టేడియం వేదికగా టీమిండియా 2గెలుపు, 3 ఓటమి రికార్డు రాజీవ్ స్టేడియంలో ఆస్ట్రేలియా 2-0 విజయాల రికార్డు ఐపీఎల్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రధాన వేదిక రాజీవ్ స్టేడియం హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ లో…డజన్ల కొద్దీ టెస్ట్ వేదికలు ఉన్నా…దేని ప్రత్యేకత దానిదే. అలాంటి అత్యాధునిక వేదికల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రముఖంగా కనిపిస్తుంది. […]

Advertisement
Update:2019-03-02 02:17 IST
  • గత 14 సంవత్సరాలలో ఐదు వన్డేలకు ఆతిథ్యం
  • రాజీవ్ స్టేడియం వేదికగా టీమిండియా 2గెలుపు, 3 ఓటమి రికార్డు
  • రాజీవ్ స్టేడియంలో ఆస్ట్రేలియా 2-0 విజయాల రికార్డు
  • ఐపీఎల్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రధాన వేదిక రాజీవ్ స్టేడియం
  • హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ లో…డజన్ల కొద్దీ టెస్ట్ వేదికలు ఉన్నా…దేని ప్రత్యేకత దానిదే. అలాంటి అత్యాధునిక వేదికల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రముఖంగా కనిపిస్తుంది. 2004లో హైదరాబాద్ క్రికెట్ సంఘం సొంతంగా నిర్మించుకొన్న రాజీవ్ స్టేడియం…ఐదేళ్ల విరామం తర్వాత…వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

భారత ప్రధాన క్రికెట్ వేదిక

ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో క్రికెట్టే.. నంబర్ వన్ గేమ్. ఏటా టెస్ట్, వన్డే సిరీస్ లతో పాటు .. ఐపీఎల్, టీ-20 మ్యాచ్ లు సైతం జరుగుతూనే ఉంటాయి.

దేశవ్యాప్తంగా…బీసీసీఐకి అనుబంధంగా ఉన్న 29 క్రికెట్ సంఘాలకు క్రికెట్ వేదికలు, స్టేడియాలు ఉన్నాయి. అయితే సొంత క్రికెట్ స్టేడియాలు నిర్మించుకొన్న అతికొద్ది క్రికెట్ సంఘాలలో హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా ఉంది.

హైదరాబాద్ లో క్రికెట్ అనగానే 2004కు ముందు వరకూ…నగరం నడిబొడ్డునే ఉన్న లాల్ బహదూర్ స్టేడియం మాత్రమే గుర్తుకు వచ్చేది.

50 కోట్ల వ్యయంతో నిర్మాణం…

అయితే…హైదరాబాద్ క్రికెట్ సంఘం…దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో…నగరశివారులోని ఉప్పల్ లో …సొంతంగానే ఓ అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించుకొని… అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తూ…భారత ప్రధాన టెస్ట్, వన్డే వేదికల్లో ఒకటిగా నిలిచింది.

4 టెస్టులు…5 వన్డేలు…1 టీ-20కి ఆతిథ్యం..

39వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన ఈ స్టేడియం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. 2005 నవంబర్ 16న తొలిసారిగా వన్డేకి ఆతిథ్యమిచ్చింది.

ఆ తర్వాత…ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడం కోసం…మరో ఐదేళ్ల పాటు వేచిచూడాల్సి వచ్చింది. 2010లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన రాజీవ్ స్టేడియం 2017 అక్టోబర్ లో తొలిసారిగా టీ-20 మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది.

2005 నుంచి 2014 శ్రీలంక సిరీస్ వరకూ…రాజీవ్ స్టేడియం కేవలం ఐదు వన్డేలకు మాత్రమే వేదికగా నిలిచింది.

2 విజయాలు-3 పరాజయాలు…

2005లో రాజీవ్ స్టేడియం వేదికగా…జరిగిన మొట్టమొదటి వన్డేలో…ఆతిథ్య టీమిండియాకు… సౌతాఫ్రికా చేతిలో 5 వికెట్ల పరాజయం తప్పలేదు.

ఆ తర్వాత రెండేళ్లకు…ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డే మ్యాచ్ లోనూ అదే ఫలితం ఎదురయ్యింది. కంగారూ టీమ్ 47 పరుగుల తేడాతో భారత్ ను చిత్తు చేసింది.

2009 సిరీస్ లో భాగంగా జరిగిన వన్డేలో సైతం భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈమ్యాచ్ లో ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో భారత్ ను అధిగమించింది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో తొలివన్డే విజయం కోసం…ఆతిథ్య టీమిండియా ఆరు సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 2011 అక్టోబర్ 14న ఇంగ్లండ్ తో ముగిసిన వన్డేలో టీమిండియా 126 పరుగుల భారీవిజయం సాధించింది.

అంతేకాదు..2014 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేలోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. శ్రీలంకపై భారత్ 6 వికెట్ల విజయం సాధించింది.

మొత్తం మీద…హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా… గత 14 సంవత్సరాలలో జరిగిన ఐదు వన్డేలలో ఆతిథ్య భారత్ 2 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉంది.

కంగారూలకు నూటికి నూరుశాతం రికార్డు

ఒక్క ఆస్ట్రేలియా జట్టు మాత్రమే…రెండుకు రెండుమ్యాచ్ లూ నెగ్గి….నూటికి నూరుశాతం రికార్డు సాధించింది.

ఐపీఎల్ లో …హైదరాబాద్ ఫ్రాంచైజీ హోంగ్రౌండ్ గా కూడా సేవలు అందిస్తున్న రాజీవ్ స్టేడియం లో 39వేల సీటింగ్ సామర్థ్యం ఉంటే…కేవలం 25 వేల టికెట్లు మాత్రమే అభిమానులకు అందుబాటులో ఉంచారు.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ఈ పాంచ్ పటాకా సిరీస్ లోని తొలివన్డేలో…ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. డే-నైట్ గా జరిగే ఈ హైదరాబాద్ వన్డే కోసం…తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News