ప్రకాశం వైసీపీకి జగన్ బంధువులే గుదిబండలు

ప్రకాశంలో వైసీపీని నేలమట్టం చేసే పనిలో జగన్‌ బంధువులు తలమునకలై ఉన్నారు. అన్ని జిల్లాల్లో సమస్యలను వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కరించుకుంటూ వస్తున్నా ప్రకాశం జిల్లాలో మాత్రం ఆయనకు పార్టీపై పట్టుచిక్కడం లేదు. అందుకు కారణం కూడా జగన్‌ బంధువులే కావడం విశేషం. ఈసారి ఓడితే భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో నేతలు కలిసి పనిచేస్తుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం జగన్‌ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు వ్యక్తిగత ప్రభావం కోసం […]

Advertisement
Update:2019-02-25 05:58 IST

ప్రకాశంలో వైసీపీని నేలమట్టం చేసే పనిలో జగన్‌ బంధువులు తలమునకలై ఉన్నారు. అన్ని జిల్లాల్లో సమస్యలను వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కరించుకుంటూ వస్తున్నా ప్రకాశం జిల్లాలో మాత్రం ఆయనకు పార్టీపై పట్టుచిక్కడం లేదు. అందుకు కారణం కూడా జగన్‌ బంధువులే కావడం విశేషం.

ఈసారి ఓడితే భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో నేతలు కలిసి పనిచేస్తుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం జగన్‌ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు వ్యక్తిగత ప్రభావం కోసం వైసీపీ కొమ్మను పోటీపడి నరుకుతున్నారు. నా దెబ్బ చూడు అంటే నా దెబ్బ చూడు అంటూ జిల్లాలో పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపించిన వేళ పరిస్థితి మరింత దిగజారిపోయింది.

వైవీ, బాలినేని బహిరంగంగానే మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. జగన్‌ తమకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు… బంధువులమైన తామే బజారుకెళ్లి పార్టీ పరువు తీయకూడదన్న ఆలోచన కూడా ఇద్దరు నేతలకు ఉన్నట్టు కనిపించడం లేదు. 2014 నుంచే ఈగోలతో రగిలిపోతున్న ఇద్దరు నేతల మధ్య… ఇటీవల దర్శి కార్యక్తల సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దూరం పెంచాయి.

వచ్చే ఎన్నికల్లో అవసరమైతే దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తామని బాలినేని ప్రకటించారు. దీంతో వైవీకి కోపం వచ్చింది. అసలు బాలినేని ఎవరు టికెట్లపై ప్రకటన చేయడానికి.. ఆయన కేవలం జిల్లా అధ్యక్షుడే… ఆయనకు(బాలినేని) కూడా టికెట్‌ ఇచ్చేది జగనే అని వైవీ కౌంటర్ ఇచ్చారు. జగన్ బంధువులైన వీరే ఇలా కౌంటర్లు
ఇచ్చుకోవడంతో టీవీ చానళ్లు.. మాటకు – మాట, దెబ్బకు – దెబ్బ, కౌంటర్- ఎన్ కౌంటర్ అంటూ టైటిళ్లు పెట్టి బాలినేని వ్యాఖ్యలను… వైవీ వ్యాఖ్యలను టూ విండోలో పెట్టి చూపిస్తున్నాయి.

బాలినేనికి కౌంటర్ ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి ఆగిపోలేదు. పార్టీ బలోపేతం చేసేందుకు టీడీపీలో ఉన్న నేతలను జగన్‌ ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై వైవీ నీళ్లు చల్లారు. టీడీపీ ఎమ్మెల్సీ, గతంలో పలుమార్లు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తే మంచి ఫలితాలుంటాయని భావిస్తున్న తరుణంలో వైవీ
తీవ్రంగా స్పందించారు.

గత ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదంటూ మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు జగన్‌ బంధువైన వైవీ. అంతే కాదు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తాను 2024లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు.

ఇలా జగన్‌ బంధువులే ఇతర నేతల రాకను వ్యతిరేకిస్తూ సొంత స్వార్థం కోసం, పదవుల కోసం పాకులాడడంచూసి జిల్లా వైసీపీ నేతలు, శ్రేణులు దిగ్బ్రాంతి చెందుతున్నాయి. జిల్లాలో బాలినేని, వైవీలను కట్టడి చేయని పక్షంలో ఈసారి కూడా ఎన్నికల తర్వాత పొరపాటైందంటూ చేతులు పిసుక్కోవాల్సి ఉంటుందని వాపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News