హామిల్టన్ వన్డేలో టీమిండియా ఘోరపరాజయం

212 బాల్స్ మిగిలి ఉండగానే పరాజయం బాల్స్ తేడాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించిన కివీస్ పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా విజయ పరంపరకు… న్యూజిలాండ్ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. హామిల్టన్ లోని సెడ్డన్ పార్క్ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల భారీ విజయంతో… టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించ గలిగింది. కివీ స్వింగ్ కు టీమిండియా కంగు…. స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా […]

Advertisement
Update:2019-01-31 15:55 IST
  • 212 బాల్స్ మిగిలి ఉండగానే పరాజయం
  • బాల్స్ తేడాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి
  • టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించిన కివీస్

పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా విజయ పరంపరకు… న్యూజిలాండ్ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. హామిల్టన్ లోని సెడ్డన్ పార్క్ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల భారీ విజయంతో… టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించ గలిగింది.

కివీ స్వింగ్ కు టీమిండియా కంగు….

స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న హామిల్టన్ పిచ్ పై…కివీజట్టు ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొంది.

రోహిత్ శర్మ నాయకత్వంలో…బ్యాటింగ్ కు దిగిన టీమిండియా…30.5 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. భారత మిడిలార్డర్ ఆటగాళ్లు రాయుడు, దినేశ్ కార్తీక్ డకౌట్లుగా వెనుదిరిగారు. లోయర్ ఆర్డర్ ఆటగాడు యజువేంద్ర చాహల్ 18 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లలో 21 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్…14.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరింది.

ఓపెనర్ నికోల్స్ 30, రోజ్ టేలర్ 37 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయి చేరడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన ట్రెంట్ బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కవీ బుల్లెట్ ప్రపంచ రికార్డు….

హామిల్టన్ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో… న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యంతవేగంగా 100 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా రికార్డుల్లో చేరాడు. పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న హామిల్టన్ సెడ్డాన్ పార్క్ పిచ్ పైన… బౌల్ట్ చెలరేగిపోయాడు. 10 ఓవర్లలో 4 మేడిన్లతో…21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

తన కెరియర్ లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించడం బౌల్ట్ కు ఇది ఐదోసారి. అంతేకాదు… ఇప్పటి వరకూ పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరుతో ఉన్న రికార్డును బౌల్ట్ తెరమరుగు చేశాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రత్యర్థిగా వకార్ 53 వన్డేల్లోనే వికెట్ల సెంచరీ సాధిస్తే… బౌల్ట్ మాత్రం… టీమిండియా ప్రత్యర్థిగా 100 వికెట్ల ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు… శుభ్ మాన్ గిల్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా… బౌల్ట్ బుల్లెట్లకు అవుటయ్యారు.

ఈ మ్యాచ్ లో బౌల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం అందుకోడమే కాదు… ప్రస్తుత సిరీస్ లో తన జట్టుకు తొలివిజయం సైతం అందించాడు.

అతిపెద్ద ఓటమి….

హామిల్టన్ వన్డేలో టీమిండియా అతిపెద్ద ఓటమిని చవిచూసింది. 50 ఓవర్ల ఈ మ్యాచ్ లో మరో 212 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

1981లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో 174 బాల్స్, 2017 లో ధర్మశాల వేదికగా శ్రీలంకతో 176 బాల్స్, 2012లో శ్రీలంకతో హంబనతోట వేదికగా 181 బాల్స్, 2010లో దంబుల్లా వేదికగా శ్రీలంకతో 209 బాల్స్ మిగిలి ఉండగానే టీమిండియా పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ తో ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడు వన్డేల్లో భారీవిజయాలు సాధించిన టీమిండియా… ఈ నాలుగో వన్డేలో మాత్రం పరమచెత్తగా ఆడి చిత్తుగా ఓడటం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

35 పరుగులకే టాపార్డర్ టపటపా….

టీమిండియా కేవలం 35 పరుగుల తేడాలోనే ఆరు టాపార్డర్ వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమి కొని తెచ్చుకొంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వన్ డౌన్ శుభ్ మన్ గిల్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ 14వ ఓవర్ తొలి బంతికే పెవీలియన్ దారి పట్టారు. వన్డే క్రికెట్లో భారత టాపార్డర్ టపటపా రాలి పోవడం ఇదే మొదటిసారికాదు.

2005లో బులావాయే వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన మ్యాచ్ లో 39 పరుగుల స్కోరుకు, షార్జావేదికగా 2000లో శ్రీలంకతో 39 పరుగులకు, 2017లో శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన పోటీలో 28 పరుగులకు టీమిండియా ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన రికార్డు సైతం ఉంది.

Tags:    
Advertisement

Similar News