వివిధ దేశాల్లో.... సంక్రాంతి
సంక్రాంతి పండుగను మనదేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ చేసుకుంటారు. ఈ పండుగ రోజు.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, సూర్యుడికి అర్ఘ్య తర్పణాలర్పించడమే ప్రధానంగా కనిపిస్తుంది. మనదేశంలో గంగాసాగర్, హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయిన్‌లవంటి ప్రదేశాలు మతవిశ్వాసాలతో పోటెత్తినట్లే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ కనిపిస్తుంది. పతంగులు, కొత్త పంటలతో తీపి విందులు ప్రధానంగా ఉంటాయి. తల్లే దైవం నేపాల్‌లో… మకర సంక్రాంతి పండుగను నేపాల్‌లో ”మాఘె సంక్రాంతి” అంటారు. కొన్ని చోట్ల ”కిచిరి సంక్రాంతి”
సంక్రాంతి పండుగను మనదేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ చేసుకుంటారు. ఈ పండుగ రోజు.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, సూర్యుడికి అర్ఘ్య తర్పణాలర్పించడమే ప్రధానంగా కనిపిస్తుంది.
మనదేశంలో గంగాసాగర్, హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయిన్‌లవంటి ప్రదేశాలు మతవిశ్వాసాలతో పోటెత్తినట్లే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ కనిపిస్తుంది. పతంగులు, కొత్త పంటలతో తీపి విందులు ప్రధానంగా ఉంటాయి.
తల్లే దైవం
నేపాల్‌లో… మకర సంక్రాంతి పండుగను నేపాల్‌లో ”మాఘె సంక్రాంతి” అంటారు. కొన్ని చోట్ల ”కిచిరి సంక్రాంతి” అని కూడా పిలుస్తారు. మాఘె సంక్రాంతి రోజు వాళ్లు నదుల్లోనూ, నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు చేస్తారు.
భాగమతి నది, గండకి, నారాయణి నదులు, దేవఘాట్, కాలీగండకీ, కోశి నదుల్లో స్నానాలు చేస్తారు. సూర్యుని కోసం చా పూజ, నారా (నారాయణుడిని స్తుతిస్తూ) పూజ నిర్వహిస్తారు. దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించమని భగవంతుని ప్రార్థిస్తారు. లడ్డు, నెయ్యి- రత్నపురి దుంప కలిపి చేసిన స్వీట్ ఇక్కడ ప్రధాన వంటకం.
నేపాల్ వాళ్లలో ఇది గొప్ప సంప్రదాయం. మాఘె సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ తల్లి పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఏడాదంతా ఇంట్లో అందరూ చక్కటి ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తుంది తల్లి. ఆ ఇంటి యజమానికి తల్లి లేకపోతే (కాలం చేసి ఉంటే), ఆ ఇంటి ఇల్లాలే తన పిల్లలతోపాటు భర్తకు కూడా ఆశీర్వచనం ఇస్తుంది.
జీవితం ఎగరాలి
బంగ్లాదేశ్‌లో… పౌష్ సంక్రాంతి, సంక్రెయిన్ అంటారు. పిల్లలు, పెద్దవాళ్లు గాలి పటాలు ఎగురవేయడంలో మునిగిపోతారు. ఢాకాలో ఏటా పతంగుల పండుగ నిర్వహిస్తారు. ఈ వేడుకను వాళ్లు ”ఘౌరి ఉత్సబ్” అంటారు.
పగలంతా ఇళ్ల డాబాల పై రంగురంగుల గాలిపటాలు ఎగురుతుంటాయి. రాత్రయితే బాణాసంచా కాల్చడం మొదలవుతుంది.
సూర్యుడే దేవుడు – ప్రకృతి తల్లి
శ్రీలంకలో… మకర సంక్రాంతిని ”సూర్యపకరణ్” అంటారు. వాళ్లకు కూడా ఇది పంటల పండుగే కావడంతో మతాలతో సంబంధం లేకుండా రైతులందరూ ఈ పండుగ చేసుకుంటారు. ప్రకృతిని, భూమాతను, పంటలను కాపాడమని సూర్యభగవానుడిని మొక్కుతారు.
తమిళులు సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. ఈ ప్రభావం శ్రీలంకలోనూ కనిపిస్తుంది.అయితే ఈ పండుగను వాళ్లు థాయ్ పొంగల్ అంటారు. థాయ్ నెలలో వచ్చే పండుగ కావడంతో అలా పిలుస్తారు.
పండక్కి పుట్టింటి సారె
పాకిస్థాన్‌లో… ఈ పండుగను సింధ్ ప్రాంతంలో వాళ్లు చేసుకుంటారు. సంక్రాంతిని వాళ్లు తిర్‌మూర్ అంటారు. సింధీల సంప్రదాయం మనకు కొత్తగా ఉంటుంది.
తల్లిదండ్రులు పెళ్లయిన కూతుళ్లకు ఈ పండుగ రోజు పుట్టింటి నుంచి స్వీట్లు పంపిస్తారు. నువ్వుల లడ్డు లేదా నువ్వుల పట్టీలు ప్రధానంగా ఉంటాయి. ఇతర తీపి పదార్థాలు అదనం. మనదేశంలో ఉండే సింధీలు కూడా సంక్రాంతి పండుగను చేసుకుంటారు.
నెల వేరు – సందర్భం ఒకటే
కాంబోడియాలో… సంక్రాంతిని మోహ సాంగ్‌క్రాన్ అంటారు. వాళ్లకు కూడా ఇది పంటల పండుగే. వాళ్లకు పంటలు వచ్చేది ఏప్రిల్ నెల కావడంతో ఆ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు వేడుకలు చేసుకుంటారు.
ప్రకృతి, పంటలతో మమైకమైన పండుగ కావడంతో మతాలతో సంబంధం లేకుండా హిందువులు, బౌద్ధులు కూడా కలివిడిగా ఈ వేడుకలు చేసుకుంటారు. వీటితోపాటు థాయ్‌ల్యాండ్, వియత్నాం వంటి మరికొన్ని దేశాలు కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటాయి.