ప్రజలకు ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు
అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు, రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు, రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అందర్భాగమైనది అన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబురాలలో ప్రధాని పాల్గొన్నారు. మోడీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోడీ పూజలు చేసిన అనంతరం భోగి మంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి, వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలు బహూకరించారు. దానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.