రన్ ఆఫ్ కచ్.... పున్నమి వెన్నెలలో.... ఉప్పుటెడారిలో విహారం....
కచ్… అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేది కచ్‌వర్క్. దుస్తుల అందంగా అల్లికలాగ చేసే ఎంబ్రాయిడరీ. కుట్లు నేర్చుకున్న వాళ్ల నైపుణ్యాన్ని చెప్పే క్రమంలో ”ఆమెకి కచ్‌వర్క్ కూడా వచ్చు” అని ప్రశంసాపూర్వకంగా చెబుతారు. కచ్ వర్క్ వచ్చి ఉండడమంటే ఎంబ్రాయిడరీలో పిహెచ్‌డి చేసినంత గొప్ప అన్నమాట. అలాంటి కచ్‌కు ఓ సారి టూర్‌కెళ్తే ఎలా ఉంటుంది? కచ్‌వర్క్ దుస్తుల్లో మునిగితేలినట్లు ఉంటుంది. ఎక్కడ ఉంది? కచ్… గుజరాత్‌లో ఓ జిల్లా. దేశానికి చివరగా ఉంటుంది. ఒకవైపు […]
కచ్… అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేది కచ్‌వర్క్. దుస్తుల అందంగా అల్లికలాగ చేసే ఎంబ్రాయిడరీ. కుట్లు నేర్చుకున్న వాళ్ల నైపుణ్యాన్ని చెప్పే క్రమంలో ”ఆమెకి కచ్‌వర్క్ కూడా వచ్చు” అని ప్రశంసాపూర్వకంగా చెబుతారు.
కచ్ వర్క్ వచ్చి ఉండడమంటే ఎంబ్రాయిడరీలో పిహెచ్‌డి చేసినంత గొప్ప అన్నమాట. అలాంటి కచ్‌కు ఓ సారి టూర్‌కెళ్తే ఎలా ఉంటుంది? కచ్‌వర్క్ దుస్తుల్లో మునిగితేలినట్లు ఉంటుంది.
ఎక్కడ ఉంది?
కచ్… గుజరాత్‌లో ఓ జిల్లా. దేశానికి చివరగా ఉంటుంది. ఒకవైపు పాకిస్థాన్, ఒకవైపు అరేబియా సముద్రం ఉంటాయి. అరేబియా సముద్రం ఇక్కడ అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉంటుంది. దాంతో జిల్లాలో మూడు వంతుల తీరం అరేబియాతోనే అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో రన్ ఆఫ్ కచ్ ప్రత్యేకమైంది.
రన్ అంటే ఎడారి. ఇది ఉప్పు ఎడారి. మనకు ఉప్పుటేరు, ఉప్పు కాల్వలే తెలిసి ఉంటాయి. కానీ ఉప్పుటెడారి మన తూర్పు తీర ప్రాంతం వాళ్ల ఊహకు అందని విషయమే. ఈ ఉప్పుటెడారి ఏడు వేల ఐదొందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. పాకిస్థాన్, సింధ్‌లో ఉన్న ప్రదేశాన్ని వదిలి మనభూభాగంలో ఉన్న విస్తీర్ణమే ఇంత పెద్దది.
ప్రపంచంలోనే పెద్ద ఉప్పుటెడారి. ఈ చరిత్ర, భౌగోళిక శాస్త్రం కోసం కాదు అక్కడికి వెళ్లాల్సింది. విస్తారమైన తెల్లటి ఎడారిలో సూర్యస్తమయాన్ని చూడడానికి, నిండు పున్నమి వెన్నెలలో ఉప్పుటెడారిలో విశ్రమించడానికి వెళ్లాలి.
సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతుంటాయి. తదేకంగా చూస్తే కళ్లు చెదురుతాయి కూడా. పండు వెన్నెలలో ఇక్కడి గుడారాల్లో నైట్ స్టే చేయడం అనే ఊహే మనసును నిలవనీయదు.
ఇంత అందమైన ప్రదేశం కావడంతోనే అనేక సినిమాలకు ఇది షూటింగ్ లొకేషన్ అవుతోంది. తెలుగులో మగధీర, సరైనోడు సినిమాల షూటింగ్ కూడా జరిగింది.
అంతర్జాతీయ స్థాయి రచయితలు కూడా తమ కథలకు ఈ ప్రదేశాన్ని ఆధారం చేసుకుంటుంటారు. అరేబియా సముద్రం నుంచి వచ్చిన వరుస ఉప్పెనలతో ఈ నేలంతా ఉప్పుమయం అయిందని చెబుతారు.
ఎడారి సవారి
ఎడారిలో ఒంటె మీద సవారీ అనగానే రాజస్థాన్ గుర్తొస్తుంది. బంగారు రంగులో మెరిసే ఇసుకలో ఒంటెల కాళ్లు కూరుకుపోతుంటే భారంగా అడుగులు వేస్తున్న ద్రుశ్యం కళ్ల ముందు మెదులుతుంది.
అయితే ఇక్కడ ఉప్పు తేలి గట్టి పడిపోయిన నేల మీద పగుళ్ల మధ్య ఒంటెలు అవలీలగా అడుగులు వేస్తుంటాయి.
ఏటా ఇక్కడ రన్ ఆఫ్ కచ్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఒకటి రెండు రోజులు కాదు, ఒకటి రెండు వారాలూ కాదు. ఏకంగా మూడు నెలలు జరుగుతాయి.
ఈ ఏడాది ఉత్సవాలు నవంబరులో మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. కాబట్టి కచ్ టూర్‌కి ఇది రైట్ టైమ్.
కచ్ షాపింగ్
కచ్‌కి వెళ్లి షాపింగ్ చేయకుండా వస్తే మనవాళ్లు విచిత్రంగా చూస్తారు. కచ్ వర్క్ కోసం ఇక్కడ వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటే అక్కడ స్థానికంగా దొరికే డిజైన్లను కొనుక్కోకుండా వెనక్కి రావడం కష్టమే.
అయితే మనం కచ్ స్థానిక ఎంబ్రాయిడరీలన్నింటినీ కచ్ వర్క్ అని పిలుస్తాం. కానీ అద్దాలు, పూసలతో అల్లిన రాబిరీ వర్క్, ఆహిర్ వర్క్, సింధీ వర్క్, బన్నీ వర్క్, ముత్వ, ఆరి, సూఫ్ వంటి వైవిధ్యమైన ఎంబ్రాయిడరీ దుస్తులు దొరుకుతాయిక్కడ. సునిశితంగా గమనిస్తే తప్ప తేడా తెలుసుకోలేం.
-మంజీర