ఇల్లెందులో మహాకూటమి, టీఆర్‌ఎస్‌ల పరిస్థితి ఏమిటి?

సింగరేణి సంస్థ పుట్టినిల్లు అయిన ఇల్లెందు అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయంగా చాలా చైతన్యవంత మైనది. షెడ్యూల్ తెగలకు రిజర్వు చేయబడిన ఈ నియోజకవర్గంలో గిరిజనులు, ఆదివాసీల జనాభా అధికంగా ఉంటుంది. సింగరేణి ఉద్యోగులు, వ్యాపారస్తులు, రైతులు కూడా కీలకంగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తరువాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఇల్లెందు పాత నియోజకవర్గంగా ఉన్నప్పుడు గుండాల మండలం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండేది. పూర్తి అటవీప్రాంతం, […]

Advertisement
Update:2018-12-04 00:32 IST

సింగరేణి సంస్థ పుట్టినిల్లు అయిన ఇల్లెందు అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయంగా చాలా చైతన్యవంత మైనది. షెడ్యూల్ తెగలకు రిజర్వు చేయబడిన ఈ నియోజకవర్గంలో గిరిజనులు, ఆదివాసీల జనాభా అధికంగా ఉంటుంది. సింగరేణి ఉద్యోగులు, వ్యాపారస్తులు, రైతులు కూడా కీలకంగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తరువాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.

ఇల్లెందు పాత నియోజకవర్గంగా ఉన్నప్పుడు గుండాల మండలం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండేది. పూర్తి అటవీప్రాంతం, ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న మండలంలో సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ ఆధిపత్యం ఉండేది. ఈ ఓట్ల సహాయంతోనే గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుండాల మండలం కొత్తగా ఏర్పడిన పినపాక అసెంబ్లీ నియోజక వర్గంలోనికి వెళ్లింది. మైదాన ప్రాంతమైన కామేపల్లి మండలం ఇల్లెందు నియోజకవర్గంలో కలిసింది.

కొత్త నియోజక వర్గంలో ఎన్డీఏ ప్రభావం తగ్గడంతో 2009లో టీడీపీ ఈ సీటును కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున కోరం కనకయ్య గెలిచారు. కాని కొన్ని నెలల్లోనే టీఆర్ఎస్‌లో చేరారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కోరం కనకయ్య, మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బానోతు హరిప్రియా నాయక్, బీజేపీ తరపున నాగ స్రవంతి, బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య బరిలో ఉన్నారు. గత కొంత కాలంగా న్యూడెమెక్రసీ పార్టీ బలం బాగానే పెంచుకుంది. కాని ఇక్కడ ఉన్న రాయల, చంద్రన్న వర్గాల విభేదాలతో ఓటర్లు చీలిపోయే అవకాశం ఉంది.

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై వ్యతిరేకత కనపడుతోంది. సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో డిపెండెంట్ ఉద్యోగాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి వర్గీయురాలిగా ఉన్న భానోతు హరిప్రియ టీడీపీ తరపున బరిలో ఉంది. ఇంతకు మునుపు టీడీపీకి ఇక్కడ పట్టుండటం… గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉండటం…. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తులో ఉండటంతో ఆమె గెలుపు ఓట్ల బదిలీపైనే ఆధారపడి ఉంది. బీజేపీ పార్టీకి ఈ నియోజకవర్గంలో అంత పట్టు లేదు.

రాజకీయంగా చైతన్యం ఉన్న ఈ నియోజకవర్గంలో సింగరేణి ఉద్యోగులు, ఆదివాసీలు, గిరిజనుల ఓట్లే కీలకంగా ఉన్నాయి. పోడు వ్యవసాయ భూముల క్రమబద్దీకరణపై గత కొంత కాలంగా ఆదివాసీలు పోరాడుతున్నారు. రైతు బంధు పథకం పోడు వ్యవసాయం చేసే వారికి అందకపోవడం కూడా వారిలో వ్యతిరేకత కనపడుతోంది. ఇన్ని సమీకరణల మధ్య కూటమి వైపే కాస్త మొగ్గు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News