అన్నాచెల్లెళ్ల శపథం.... నెరవేరుతుందా?

అన్నా చెల్లెళ్లు పంతం పట్టారు.. ఆ రెండు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. తమను అవమానించిన ఆ ఇద్దరు నేతలను ఓడించేందుకు ఏకంగా నియోజకవర్గ బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ లో ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా.. అన్నాచెల్లెళ్ల పంతం నెగ్గి టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వారసులైన అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవితలు ఇప్పుడు తండ్రికి ఆ రెండు నియోజకవర్గాలను గిఫ్ట్ గా ఇస్తామని […]

Advertisement
Update:2018-12-01 10:48 IST

అన్నా చెల్లెళ్లు పంతం పట్టారు.. ఆ రెండు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. తమను అవమానించిన ఆ ఇద్దరు నేతలను ఓడించేందుకు ఏకంగా నియోజకవర్గ బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ లో ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా.. అన్నాచెల్లెళ్ల పంతం నెగ్గి టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ వారసులైన అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవితలు ఇప్పుడు తండ్రికి ఆ రెండు నియోజకవర్గాలను గిఫ్ట్ గా ఇస్తామని శపథం చేశారట. ఆ రెండు నియోజకవర్గాలు వరంగల్ తూర్పు, జగిత్యాల. కొండా సురేఖ టీఆర్ఎస్ ను వీడుతూ కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి పరకాల, వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ ను ఓడిస్తానని కొండా సురేఖ శపథం చేశారు. అంతేకాదు.. కేటీఆర్ మొత్తం లాబీయింగ్ చేస్తున్నాడని విమర్శనాస్త్రాలు సంధించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ వరంగల్ తూర్పుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ రద్దు నుంచి అభ్యర్థి ఎంపిక ప్రచారం అంతా కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతోంది.

వరంగల్ తూర్పులో అత్యధికంగా ఉన్న బీసీల ఓటు బ్యాంకు కోసం హేమాహేమీలు పోటీపడ్డా కూడా వరంగల్ మేయర్ నన్నపనేని రవీందర్ కే టికెట్ ను కేటీఆర్ ఇప్పించారు. ఇక కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ శిష్యుడు మద్దిరాజు రవిచంద్ర బరిలో ఉన్నారు. ఈయన బీసీనే.. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో కొండా దంపతులకు గట్టి పట్టు ఉంది.

బస్వరాజు సారయ్య వంటి సీనియర్లను కూడా పక్కనపెట్టి కేటీఆర్ రవీందర్ కు టికెట్ ఇప్పించాడు. ఇక్కడ ఎలాగైనా సరే కొండా సురేఖ చాలెంజ్ చేసినట్టు ఆ పార్టీని గెలవనీయకుండా చేయాలని కేటీఆర్ కంకణం కట్టుకున్నారట. అయితే నన్నపనేని రవీందర్‌ను ఆ నియోజకవర్గంలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

అయినా కేటీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ కార్పొరేటర్లను సాయంత్రానికే మళ్లీ టీఆర్ఎస్ లో చేర్పించారట.. ఇలా కొండా సురేఖ, కేటీఆర్ పంతం.. వరంగల్ తూర్పులో హాట్ టాపిక్ గా మారింది.

ఇక తండ్రికి జగిత్యాలను గిఫ్ట్ గా ఇస్తానని కేసీఆర్ కూతురు కవిత కూడా శపథం చేసిందట. కేసీఆర్ ఉద్యమకాలంలో కరీంనగర్ ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఆకాలంలో వైఎస్ ప్రోద్బలంతో జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి మూడుసార్లు కేసీఆర్ పై పోటీచేసి టఫ్ ఫైట్ ఇచ్చాడు. 2014లో కూడా కరీంనగర్ జిల్లా మొత్తం గెలిచిన టీఆర్ఎస్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని మాత్రం ఓడించలేకపోయింది. ఆయన గెలిచి కాంగ్రెస్ ఉప శాసనసభాపక్ష నేత అయ్యి కేసీఆర్ పై అసెంబ్లీ లో తీవ్ర విమర్శలు కూడా చేశారు.

ఈ నేపథ్యంలో తండ్రిని ఇరుకున పెడుతున్న జీవన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కవిత గడిచిన నెలరోజులుగా జగిత్యాలలోనే మకాం వేశారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. అయితే ఆ నియోజకవర్గంలో జీవన్‌ రెడ్డికి గట్టి పట్టు ఉంది. కవిత ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జీవన్‌ రెడ్డికి కార్యకర్తల్లో వీరాభిమానులున్నారు. అయినా సరే ఎలాగైనా జీవన్ రెడ్డిని ఓడించి కేసీఆర్ కు జగిత్యాలను కానుకగా ఇచ్చి శభాష్ అనిపించుకోవాలని పంతం పట్టారట.

ఇలా అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఆ కాంగ్రెస్ నేతలపై పగబట్టి ఆ నియోజక వర్గాల్లో గెలిచేందుకు తీవ్ర కృషి చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News