ఈవీఎంలకు వీవీ ప్యాట్లు నావల్లే వచ్చాయి.... సభ్యత వల్లే కేసీఆర్‌ను విమర్శించడం లేదు

చారిత్రక అవసరం వచ్చింది కాబట్టే రాహుల్‌ గాంధీతో కలిసి వేదిక పంచుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఖమ్మం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన చంద్రబాబు… తాను రాహుల్ కలిసి పాల్గొన్న ఈ మీటింగ్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్‌బీఐ, గవర్నర్‌ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయన్నారు. ఎన్‌డీఏ పాలన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేసి ఏటీఎంలలో డబ్బులు కూడా దొరక్కుండా చేశారన్నారు. […]

Advertisement
Update:2018-11-28 12:49 IST

చారిత్రక అవసరం వచ్చింది కాబట్టే రాహుల్‌ గాంధీతో కలిసి వేదిక పంచుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఖమ్మం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన చంద్రబాబు… తాను రాహుల్ కలిసి పాల్గొన్న ఈ మీటింగ్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్‌బీఐ, గవర్నర్‌ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయన్నారు. ఎన్‌డీఏ పాలన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేసి ఏటీఎంలలో డబ్బులు కూడా దొరక్కుండా చేశారన్నారు. జీఎస్‌టీ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు.

దేశం కోసం కాకుండా స్వార్థంతో కేంద్రంలో పనిచేస్తున్నారన్నారు. మీడియా కూడా స్వేచ్చగా రాయలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. అందుకే కాంగ్రెస్‌తో కలిశామన్నారు. 37 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో టీడీపీ పోరాటం చేసిందన్నారు.

ఈరోజు రెండుపార్టీలు కలిశాయంటే దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం కలిశామన్నారు. ఖమ్మంలో మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి ఊరిలో స్కూళ్లు తాను తెచ్చినవేనన్నారు చంద్రబాబు. హైదరాబాద్‌ను కట్టానని తానెప్పుడూ చెప్పుకోలేదని.. సైబరాబాద్‌ కు రూపకల్పన చేసింది మాత్రం తానేనని చంద్రబాబు చెప్పుకున్నారు.

కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నన్ను దూషించడం న్యాయమా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ లేకుంటే కేసీఆర్‌ అనే వ్యక్తి ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ రేపోఎల్లుండో ఇంకా ఎక్కువగా తనను విమర్శిస్తారని చంద్రబాబు చెప్పారు.

తనకు సభ్యత ఉందని అందుకే కేసీఆర్‌ను తిరిగి విమర్శించబోనన్నారు. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని… ఈవీఎంల విషయంలోనూ జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను పోరాటం చేయడం వల్లే ఈవీఎంలకు వీవీప్యాట్‌ వచ్చిందన్నారు.

అనుమానం వస్తే వీవీప్యాట్‌లను కూడా కౌంట్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిందన్నారు. అలాంటి నగరం తెలంగాణకు ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ చాలా దారుణంగా తయారైందన్నారు. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా తాను మాట్లాడడం లేదన్నారు.

బీజేపీకి ఓట్లు లేవు కాని హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. డబ్బు సంచులతో బీజేపీ నేతలు వస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను, రాహుల్‌ కలిసి కూటమి పెడుతున్నామని… కేసీఆర్‌, ఎంఐఎం ఎటు ఉంటారో చెప్పాలని చంద్రబాబు కోరారు. కేసీఆర్‌కు ఓటేసినా, ఎంఐఎంకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టేనన్నారు చంద్రబాబు.

ఖమ్మం జిల్లాలో పది సీట్లలోనూ మహాకూటమిని గెలిపించాలని కోరారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆవేశాలుండేవన్నారు.

తెలుగుజాతి ఎప్పటికైనా ఒక్కటిగా ఉండాలని ముందుకెళ్లామన్నారు. ఇద్దరిని కలపాలని ముందుకెళ్లామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు… తెలంగాణకు బయ్యారం స్టీల్‌ ప్లాంట్ కూడా ఇవ్వలేదన్నారు. గిరిజన యూనివర్శిటీని కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు.

కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం వీటిని అడగడం లేదన్నారు. మహాకూటమి వస్తే చంద్రబాబు పెత్తనం చేస్తారంటూ మాట్లాడుతున్నారని… కానీ తెలంగాణకు వచ్చి పోటీ చేసే అవకాశం తనకు లేదన్నది అందిరికీ తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గోదావరి నుంచి రెండువేలకు పైగా టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కింద ఉందని.. అలాంటి రాష్ట్రం తెలంగాణకు నీరు రాకుండా అడ్డుపడుతోందనడం సరికాదన్నారు.

Tags:    
Advertisement

Similar News