వారసుల కోసం కాంగ్రెస్ నేతల పోరు
ఆశావహులు సీటు కోసం పోటాపోటీ పడటం సహజం. కానీ, తనయుల కోసం తండ్రులు కత్తులు దూసుకోవడం కొంత ఆసక్తికర విషయమే. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ వ్యవహారం ఎటు వైపునకు దారి తీస్తుందోనని అటు కార్యకర్తలు ఇటు నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తనయులకు టిక్కెట్ల కోసం అంజన్ కుమార్, ముఖేష్ గౌడ్ మధ్య పోటీ నెలకొంది. ఒకరి నియోజకవర్గం వ్యవహారాల్లో మరొకరు కలగ జేసుకుంటూ ఉత్కంఠ రేపుతున్నారు. గోషామహల్ […]
ఆశావహులు సీటు కోసం పోటాపోటీ పడటం సహజం. కానీ, తనయుల కోసం తండ్రులు కత్తులు దూసుకోవడం కొంత ఆసక్తికర విషయమే. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ వ్యవహారం ఎటు వైపునకు దారి తీస్తుందోనని అటు కార్యకర్తలు ఇటు నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తనయులకు టిక్కెట్ల కోసం అంజన్ కుమార్, ముఖేష్ గౌడ్ మధ్య పోటీ నెలకొంది. ఒకరి నియోజకవర్గం వ్యవహారాల్లో మరొకరు కలగ జేసుకుంటూ ఉత్కంఠ రేపుతున్నారు. గోషామహల్ టిక్కెట్టును ముఖేష్ గౌడ్ ఆశిస్తుండగా, ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ కు ముషీరాబాద్ టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇది తెలిసిన అంజన్ కుమార్ తన కొడుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ కు ముషీరాబాద్ టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అంజన్ ఎంపీగా పోటీ చేస్తానని, తన కొడుక్కి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అంటున్నారట.
ఈ క్రమంలో గోషా మహల్ నియోజకవర్గంలో అసమ్మతి రాజేస్తుంది అంజన్ అని అనుమానాన్ని ముఖేష్ గౌడ్ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల స్థానికంగా ఓ సమావేశం ఏర్పాటు చేసిన పలువురు కాంగ్రెస్ నేతలు ముఖేష్ పై బహిరంగ విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఎన్నికలకు 6నెలల ముందు వచ్చి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమేమిటని ప్రశ్నించారు. అసలు ఆయనకు టిక్కెట్టే ఇవ్వవద్దని ఖరాకండిగా తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో తనయుడికి టిక్కెట్ ఇప్పించాలని పట్టుదలగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్.. అందుకు అడ్డుగా ఉన్న ముఖేష్, విక్రమ్ లను అడ్డు తొలగించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ తండ్రి, కొడుకుల కథ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి చేరడంతో, ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ మొదలైంది. ముషీరాబాద్ టిక్కెట్ ఎవ్వరికి దక్కుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.