కైమా.... కైమా చేస్తామంటే అడిగినోళ్ళు లేరు.... కాల్చి చంపాలన్నందుకు మాత్రం యాగీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత ఏడాది నంద్యాల ఉప ఎన్నికలపుడు బహిరంగ సభలో గంటన్నరకు పైగా చక్కటి రాజకీయ ప్రసంగం చేశారు. అదే సభలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ తమ పార్టీలోకి రావడానికి వీల్లేదంటూ శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి (సుమారు ఆరేళ్ళ పదవీ కాలం ఉండగానే) తమ పార్టీలో చేర్చుకుని రాజకీయ నైతిక విలువలను పాటించారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా తప్పు పట్టడానికి వీల్లేని విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని […]

Advertisement
Update:2018-10-29 07:52 IST

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత ఏడాది నంద్యాల ఉప ఎన్నికలపుడు బహిరంగ సభలో గంటన్నరకు పైగా చక్కటి రాజకీయ ప్రసంగం చేశారు. అదే సభలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ తమ పార్టీలోకి రావడానికి వీల్లేదంటూ శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి (సుమారు ఆరేళ్ళ పదవీ కాలం ఉండగానే) తమ పార్టీలో చేర్చుకుని రాజకీయ నైతిక విలువలను పాటించారు.

ఆయన ప్రసంగంలో ఎక్కడా తప్పు పట్టడానికి వీల్లేని విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అయితే “ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబునాయుడును కాల్చి చంపాలి” అంటూ జగన్‌ మాట్లాడి తనపై తానే మట్టి చల్లుకున్నారు. నంద్యాల సభలో ఏ తప్పూ పట్టుకోవడానికి వీల్లేక పోవడంతో ఎక్కడ నోరు జారతాడా! అని వేచి ఉన్న వ్యతిరేక మీడియా, వ్యతిరేక వర్గాలు “కాల్చి చంపాలి” అనే మాటను పట్టుకుని పెను వివాదమే సృష్టించాయి.

ఈ మాటలు జగన్‌ అన్నాడా…. లేక మరొకరన్నారా? అని చూసే కన్నా ఎవరు అలాంటి పద ప్రయోగం చేసినా తీవ్రంగా ఖండించాల్సిన అంశం. మనకు నచ్చిన వాడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు అనే స్వేచ్ఛ, నిర్మాణాత్మకమైన రీతిలో ఒకరినొకరు విమర్శించుకోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న సౌందర్యం…. సౌలభ్యం. అభ్యంతరకర, అప్రజాస్వామిక పదజాలాన్ని ఎవరు వాడినా ముమ్మాటికీ తప్పు అవుతుంది.

కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఓ వర్గం మీడియా సైతం నిస్సిగ్గుగా అవకాశవాదాన్ని ప్రదర్శిస్తోంది. కాల్చి చంపాలి అని జగన్‌ అన్నపుడు చర్చలు పెట్టి నానా యాగీ చేసిన ఓ వర్గం మీడియాకు, ఇపుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని, “తమ కార్యకర్తలు అనుకుంటే జగన్‌ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎలా చేస్తాడు? నడి రోడ్డుపైనే జగన్‌ను కైమా… కైమా చేసేసేవాళ్ళు…” అన్న వ్యాఖ్యలు ఇంపుగా వినిపిస్తున్నాయి.

అలాగే పలువురు మంత్రులు, ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి… “తాము అనుకుంటే గోక్కోవడం, గిల్లుకోవడం వంటివి ఉండదని, పక్కాగా లేపేస్తాం” అని అహంకారంతో అన్న మాటలు సొంపుగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా జగన్‌ “కాల్చి చంపాలి” అన్న మాటలే నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మార్చిన ఘనత టీడీపీకి, ఓ వర్గం మీడియాకు దక్కింది.
చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని ఎన్నికల్లో కాల్చివేసేంత (ఓడించే) వరకూ వెళ్ళింది.

మరి కేశినేని, సోమిరెడ్డి మాటలను అసలు పట్టించుకోని మీడియాను చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రపంచమంతా ఓ వైఖరితో ఉంటే… ఏపీలో మాత్రం చంద్రబాబు భజన బృందంగా మీడియా శక్తులు పని చేస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభా సాక్షిగా “పాతేస్తాను రోయ్‌…!” అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు కూడా అసలు వారికి వినపడవు, కనపడవనే భావించాలి.

నాని, మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ప్రస్తావనకే తీసుకు రారు. జగన్‌ సొంత మీడియా అయిన సాక్షి ఒక్కటే ప్రస్తుతం ఈ విషయంపై కొంత చర్చ పెడుతోంది గానీ మిగతా మీడియా వర్గాలు మాత్రం టీడీపీ నేతలు అలా వ్యాఖ్యానించడం వారి హక్కు అన్న విధంగా వ్యవహరిస్తోండటం విస్మయాన్ని కలిగిస్తున్నది.

Tags:    
Advertisement

Similar News