పవన్.... మేం కూడా అందుకే అసెంబ్లీని బహిష్కరించింది....
జనసేన కవాతు సందర్భంగా రాయలసీమ ప్రాంతంపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. గోదావరి జిల్లాలు మర్యాదలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు అని.. అలాంటి గడ్డపై నిలబడి ఫ్యాక్షన్ భాష మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు పవన్‌ను ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో ఫ్యాక్షన్ ఎక్కడ ఉందని…. దాన్ని గోదాట్లో కలుపుతామని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాడో తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రాంతీయ […]
జనసేన కవాతు సందర్భంగా రాయలసీమ ప్రాంతంపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. గోదావరి జిల్లాలు మర్యాదలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు అని.. అలాంటి గడ్డపై నిలబడి ఫ్యాక్షన్ భాష మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు పవన్‌ను ప్రశ్నించారు.
గోదావరి జిల్లాల్లో ఫ్యాక్షన్ ఎక్కడ ఉందని…. దాన్ని గోదాట్లో కలుపుతామని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాడో తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు రాయలసీమపై పనిగట్టుకుని చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ ఊతమిస్తున్నట్టుగా ఉందన్నారు.
టీడీపీ భావజాలం నుంచి పవన్ కల్యాణ్ బయటపడాలని సూచించారు. రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయడం లేదని కన్నబాబు ప్రశ్నించారు.
జగన్ మీద కోపం లేదని పవన్ చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో అర్థరహితంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన హంతకులను కూడా క్షమించి వదిలేసిన కుటుంబం వైఎస్‌ఆర్‌ది అని కన్నబాబు చెప్పారు. అదే హంతకులకు చంద్రబాబు ఆశ్రయం కల్పించింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిజం చేసే వ్యక్తి అయితే కడప ఎంపీగా ఉప ఎన్నికల్లో ఐదున్నర లక్షల మెజారిటీ వచ్చేదా అని ప్రశ్నించారు.
వ్యవస్థలు విఫలమయ్యాయి కాబట్టే కవాతు నిర్వహించామని పవన్ కల్యాణ్ చెబుతున్నారని… తాము కూడా ఆ వ్యవస్థలు విఫలం అవడం వల్లే అసెంబ్లీని బహిష్కరించాల్సి వచ్చిందని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలకు తాను పూచికత్తుగా ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ నాలుగేళ్లుగా ఆ పని చేయకుండా ఇప్పుడు మాత్రం కంటితుడుపు చర్యగా నాలుగు విమర్శలు చేస్తున్నారని దాడిశెట్టి రాజా విమర్శించారు.
తాటా తీస్తా… తోలుతీస్తా… అంటున్న పవన్ కల్యాణ్… మరి పురుషోత్తపట్నం, పట్టిసీమ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్న చంద్రబాబు తాట ఎందుకు తీయడం లేదని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉంటుందని పోలీసులు హెచ్చరించినా ఏజెన్సీకి వెళ్లి చాపరాయి బాధితులను పరామర్శించిన వ్యక్తి జగన్ అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు.