వదినమ్మలతో అన్నయ్యలకు కొత్త తంటా !
రాజకీయాలంటే అందరికీ ఆసక్తి ఎక్కువే. భర్తలు సీనియర్ నేతలు అయితే… వారి భార్యలకు కూడా రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుచరులు, జనం జేజేలు… ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా చూసే విధానం, అందరూ గౌరవించే విధానం చూశారో ఏమో… ఇప్పుడు సీనియర్ నేతల భార్యలు కూడా రాజకీయాలు అంటే ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో వదినమ్మలతో అన్నయ్యలకు సమస్యలు వస్తున్నాయి. ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భార్య పద్మినీ రెడ్డి ఎపిసోడ్ ఇదే విషయాన్ని […]
రాజకీయాలంటే అందరికీ ఆసక్తి ఎక్కువే. భర్తలు సీనియర్ నేతలు అయితే… వారి భార్యలకు కూడా రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుచరులు, జనం జేజేలు… ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా చూసే విధానం, అందరూ గౌరవించే విధానం చూశారో ఏమో… ఇప్పుడు సీనియర్ నేతల భార్యలు కూడా రాజకీయాలు అంటే ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో వదినమ్మలతో అన్నయ్యలకు సమస్యలు వస్తున్నాయి. ఇంటి పోరు రచ్చకెక్కుతోంది.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భార్య పద్మినీ రెడ్డి ఎపిసోడ్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా రోజుల నుంచి ఆమె అనుకుంటున్నారు. తన కోరికను భర్త ముందు ఉంచారు. అయితే అక్కడ జగ్గారెడ్డి పాగా వేసి ఉన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ రావడం కష్టం. ఒకే ఫ్యామిలీ ఒకే టికెట్ రూల్ పెడితే…. ఆమెకు టికెట్ రావడం కష్టం. ఇదే విషయాన్ని రాజనరసింహ ఆమెకు చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆమె కల. దీంతో అప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పరిపూర్ణానంద ఆమెకు తెలుసు. బీజేపీలోకి వస్తే టికెట్ ఇస్తామని ఆయన నుంచి హామీ రావడంతో భర్తకు చెప్పకుండా ఆమె బీజేపీలో చేరారు. కానీ ఆతర్వాత జరిగిన తప్పిదం తెలుసుకుని ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇదంతా ఓ కుట్ర పూరితంగా జరిగిందని రాజనరసింహ ఆరోపిస్తున్నారు.
ఒక్క పద్మినీరెడ్డియే కాదు. చాలా మంది సీనియర్ నేతల భార్యలు అవకాశం కోసం భర్తల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క భార్య నందినీకి కూడా రాజకీయాలంటే ఆసక్తి. వీలు కుదిరితే ఆమె కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె మధిర నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు. వివాహాలకు హాజరవుతున్నారు. భర్తతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇటు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు భార్య ఉష కూడా పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎర్రబెల్లిని జనగామకు పంపించి….ఆమె పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాన్ వేశారు. కానీ ఎందుకో వర్క్‌వుట్ కాలేదు. మరోవైపు ఆమె ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొంతంగా సమావేశాలకు హాజరవుతున్నారు.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి భార్య సుచరిత కూడా రాజకీయాల వైపు చూస్తున్నారు. గత మూడు నెలలుగా టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొంటున్నారు. భర్తకు కొంచెం షార్ట్ టెంపర్. దీంతో తనకు టికెట్ ఇవ్వాలని ఓ దశలో ఆమె ప్రతిపాదన కూడా పెట్టారు. భర్తపై వ్యతిరేకతను తాను అధిగమిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికి ఈమె బంధువు. ఈమె కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి…ఏదో ఒక పదవి పొందాలనే ప్లాన్‌లో ఉన్నారు. వదినమ్మ డీకే అరుణకు పోటీగా ఎదగాలని చూస్తున్నారు.
వీరే కాదు ఉత్తమ్ సతీమణి పద్మావతి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని ఆమె భావిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ సతీమణికి కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రత్యర్థుల సెగ నేతలకు తగలడం లేదు. ఇంట్లో నుంచి పోటీ రావడంతో అన్నయ్యలు తలలు పట్టుకుంటున్నారు.