గిడ్డి ఆశలు ఆవిరి.... బాబు కొత్త ఎత్తు

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పిరాయింపు సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు. కొందరికి మంత్రి పదవులు ఆఫర్ చేశారు. అలా మంత్రి పదవుల హామీతో పార్టీలో చేరిన వారిలో భూమా నాగిరెడ్డి ఒకరు. ఆయనకు బతికున్న కాలంలో మంత్రి పదవి ఇచ్చేందుకు నాన్చిన చంద్రబాబు నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయిన తర్వాత ఆయన కుమార్తెకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మరో ముగ్గురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నమ్మకంతో గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీలోకి ఫిరాయించారు. […]

Advertisement
Update:2018-10-05 07:35 IST

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పిరాయింపు సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు. కొందరికి మంత్రి పదవులు ఆఫర్ చేశారు. అలా మంత్రి పదవుల హామీతో పార్టీలో చేరిన వారిలో భూమా నాగిరెడ్డి ఒకరు. ఆయనకు బతికున్న కాలంలో మంత్రి పదవి ఇచ్చేందుకు నాన్చిన చంద్రబాబు నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయిన తర్వాత ఆయన కుమార్తెకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మరో ముగ్గురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు.

ఆ నమ్మకంతో గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీలోకి ఫిరాయించారు. గిరిజన కోటాలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అందుకే పార్టీ మారినట్టు ఆమె స్వయంగా ఒక వీడియోలో చెప్పారు. కానీ ఇప్పటికీ గిడ్డికి మంత్రి పదవి కలగానే ఉంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజాగా చేస్తున్న ఆలోచన గిడ్డి ఈశ్వరి మంత్రి పదవి ఆశలపై నీరు పోసేలా ఉంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో…. గిరిజనుల్లో సానుకూలత, సానుభూతి కోసం కిడారి పెద్దకుమారుడు శ్రవణ్‌ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్లతోనూ చర్చించారు.

2014 నుంచి ఇప్పటి వరకు తన కేబినెట్‌లో ముస్లింలకు, గిరిజనులకు చంద్రబాబు చోటు కల్పించలేదు. ఎన్నికల వేళ ఈ నిందను పోగొట్టుకోవాలనుకుంటున్న చంద్రబాబు అక్టోబర్ లో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ముస్లింల నుంచి ఫరూక్‌, షరీఫ్ పేర్లను పరిశీలిస్తున్నారు. గిరిజనుల నుంచి గిడ్డి ఈశ్వరి మంత్రి పదవిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే గిడ్డి ఈశ్వరికి మంత్రి పదవి ఇస్తే మరోసారి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారన్న అంశం చర్చకు వస్తుందని.. ఎన్నికల వేళ ఆ తరహా చర్చ మంచిది కాదని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈనేపథ్యంలో కిడారి కుమారుడు శ్రవణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇస్తే సానుభూతితో పాటు ఫిరాయింపు వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారన్న భావన ఉండదని భావిస్తున్నారు. ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రి అయితే ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.

అయితే మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలే వచ్చే అవకాశం ఉండడంతో శ్రవణ్‌కుమార్‌ను ఏదో ఒక సభకు పంపాలన్న ఇబ్బంది ఉండకపోవచ్చని చంద్రబాబు ఆలోచన. కిడారి మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఎలాగో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు.

కాబట్టి శ్రవణ్‌ కుమార్‌కు మంత్రి పదవి ఇస్తే గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చినట్టు అవడంతో పాటు సానుభూతి కూడా కలిసి వస్తుందని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన గురించి తెలిసిన గిడ్డి ఈశ్వరి తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు.

Tags:    
Advertisement

Similar News