"C/o కంచరపాలెం" సినిమా రివ్యూ

రివ్యూ:  C/o కంచరపాలెం రేటింగ్‌: 3.5/5 తారాగణం: నిత్య శ్రీ, కేశవ కె, రాధా బెస్సె, ప్రవీణ పరుచూరి, సుబ్బా రావు తదితరులు సంగీతం: స్వీకర్‌ అగస్తీ నిర్మాత: ప్రవీణ్‌ పరుచూరి దర్శకత్వం: మహా వెంకటేష్‌ తెలుగు సినిమా ఎటు పోతోంది? ఏమవుతోంది? అని అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వింటూనే ఉంటాం. మూసలో పడిపోయి ఒకే ఫార్ములాకు కట్టుబడి కొత్తగా ఎవరూ ఆలోచించడం లేదే అని గగ్గోలు పెడుతున్న సమయంలో ఒక సినిమా గురించి చాలా పాజిటివ్ గా ప్రీ రిలీజ్ టాక్ విన్పించడం […]

Advertisement
Update:2018-09-07 04:12 IST

రివ్యూ: C/o కంచరపాలెం
రేటింగ్‌: 3.5/5
తారాగణం: నిత్య శ్రీ, కేశవ కె, రాధా బెస్సె, ప్రవీణ పరుచూరి, సుబ్బా రావు తదితరులు
సంగీతం: స్వీకర్‌ అగస్తీ
నిర్మాత: ప్రవీణ్‌ పరుచూరి
దర్శకత్వం: మహా వెంకటేష్‌

తెలుగు సినిమా ఎటు పోతోంది? ఏమవుతోంది? అని అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వింటూనే ఉంటాం. మూసలో పడిపోయి ఒకే ఫార్ములాకు కట్టుబడి కొత్తగా ఎవరూ ఆలోచించడం లేదే అని గగ్గోలు పెడుతున్న సమయంలో ఒక సినిమా గురించి చాలా పాజిటివ్ గా ప్రీ రిలీజ్ టాక్ విన్పించడం ”కేరాఫ్ కంచరపాలెం” విషయంలోనే జరిగింది. ఇంతా చేసి అందులో స్టార్లు ఉన్నారా అంటే లేరు. పోనీ గ్రాఫిక్స్ ఫాంటసీ లాంటివి ఉన్నాయా అంటే అవీ లేవు. మరి విడుదలకు ముందే ఇంత చర్చ ఎలా జరుగుతోంది అనే అనుమానం మాత్రం అందరి మెదళ్లను తొలిచేసింది.

ఇది నాలుగు జీవితాల కథ. కంచరపాలెం లో నివసించే ప్రేమ జంటలను సహజంగా అందంగా మనసును తాకేలా వెండితెరపై ఆవిష్కరించిన సినిమా. గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేసే అటెండర్ తన పై అధికారిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అవుతారు. ఇది మొదటి ప్రేమ. క్రిస్టియన్ మతానికి చెందిన ఓ జులాయి బ్రాహ్మల పిల్లను లవ్ చేస్తాడు. ఇది రెండో ప్రేమ. వైన్ షాప్ లో పనిచేసే వాడు ఓ ముస్లిం పిల్ల ప్రేమలో పడిపోతాడు. ఇది మూడో ప్రేమ. ఇక విద్యార్థులైన ఒకే ఈడు పిల్లలు ప్రేమలో పడతారు. ఇది నాలుగోది. అసలు వీటికి లింక్ ఏంటి ఈ ప్రేమ కథలన్నీ చివరికి ఏమయ్యాయి కంచి చేరాయా లేక కొట్లాటలకు దారి తీశాయా అనేది ఇక్కడ చెప్పడం భావ్యం కాదు.

కేరాఫ్ కంచరపాలెం కట్టిపడేసిందంటే దానికి కారణం దర్శకుడి ప్రతిభతో పాటు చాలా సహజంగా నటించిన నటవర్గం. ఎవరికీ యాక్టింగ్ స్కూల్ లో కోచింగ్ ఇవ్వలేదు. అందరిదీ ఒకే ప్రాంతం. మనలాంటి మామూలు మనుషులే. అసలు తాము సినిమాలో నటిస్తున్నాం అన్న స్పృహ లేకుండా చేసిన ప్రతి ఒక్కరు ప్రశంసలకు అర్హులే. రాజుగా నటించిన సుబ్బారావు కొద్దిరోజుల పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. సీనియర్ నటుడిలా అతను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఔరా అనిపిస్తాయి. కార్తీక్ రత్నం, మోహన్ భగత్, రాధా జెస్సి, కేశవ కర్రి, నిత్యశ్రీ ఇలా ఎవరికి వారు పోటీ పడటంతో మంచి అవుట్ ఫుట్ వచ్చింది. నటీనటులందరూ తమలో బెస్ట్ ని ఇస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చేసారు ప్రతి ఒక్కరు.

దర్శకుడు వెంకటేష్ మహాకు ఇది మొదటి సినిమా అనే స్పృహ బాగా ఉంది కనకే ఎలా తీస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో బాగా అధ్యయనం చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇద్దరు తప్ప మిగిలినవారెవరూ ముక్కు మొహం తెలియని బ్యాచ్ తో ఇలాంటి కథను తెరకెక్కించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ వెంకటేష్ మహా ఎక్కడా తొణకలేదు. అలా అని కమర్షియల్ సూత్రాలని మర్చిపోలేదు. కథలో ఆత్మ చెడిపోకుండా పక్కదారి పట్టకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ కి కట్టుబడి ఉండటంతో మంచి సినిమా తయారైంది. ఇతనికి మంచి భవిష్యత్తు ఇవ్వడం ఖాయం.

మసాలా అంశాలు ఏవి లేకుండా రెండు గంటలకు పైగా కట్టి పడేస్తూ కూర్చోబెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇందులో సక్సెస్ అయ్యాడు వెంకటేష్ మహా. అతనికి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అండగా నిలిచాడు స్వీకర్ అగస్తి. మూడ్ ని నిలబెడుతూ ఇచ్చిన సంగీతం ఆకర్షణగా నిలిచింది. వరుణ్-ఆదిత్యలు దీన్ని డిఎల్ఎస్ఆర్ కెమెరాతో తీశారంటే నమ్మడం కష్టమే. కంచరపాలెంలో తిరుగుతున్నట్టే ఉంటుంది. రవితేజ గిరజాల ఎడిటింగ్ బాగుంది.

చివరిగా చెప్పాలంటే ఓ మంచి అనుభూతిని అందుకోవాలంటే మిస్ కాకుండా చూడాల్సిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. సహజత్వం దర్శకుడి సృజనాత్మకతతో పోటీ పడితే ఎలా ఉంటుందో చూడాలంటె మాత్రం థియేటర్ లోనే చూడాల్సిన కోవలో దీన్ని చేర్చవచ్చు. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా యువతరం దర్శకుల ఆలోచనా తీరు ఉండటం నిజంగా అభినందనీయం.

బాక్స్ ఆఫీస్ సక్సెస్ వసూళ్ల లెక్కలకు అతీతంగా వీటిని ప్రేక్షకులు ఆదరించినప్పుడు కొత్త టాలెంట్ ఇంకా విస్తృతంగా ప్రపంచానికి పరిచయమవుతుంది. తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో కూడా వస్తున్నాయని ఇకపై చెప్పుకోవచ్చు.

కేరాఫ్ కంచరపాలెం – మనసుకు హత్తుకునే సహజత్వం

Advertisement

Similar News