నాది, రెహమాన్‌ కుమార్తెలది ఒకే వయసు

మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరమన్న మోహినిదే

Advertisement
Update:2024-11-26 13:27 IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ దంపతుల విడాకుల నేపథ్యంలో ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే పేరుతెరమీదికి వచ్చింది. రెహమాన్‌, సైరాబానుల డివోర్స్‌ను మోహినిదేకు లింక్‌ చేస్తూ అనేక వార్తలు వైరల్‌ అయ్యాయి.. దీనిపై మోహినిదే తాజాగా స్పందించారు. రెహమాన్‌ తనకు తండ్రితో సమానమన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

నాది, రెహమాన్‌ కుమార్తెలది ఒకే వయసు. ఆయనెప్పుడూ నన్ను తన కుమార్తెలాగే చూసేవారు. ఎనిమిదేళ్లకుపైగా ఆయన బృందంలో పనిచేశాను. ఆయనంటే ఎంతో గౌరవం ఉన్నది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్‌ అందించాను. మేమంతా కలిసి ఎన్నో స్టేజ్‌ షోలు చేశాం. మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం సరికాదు. ఇవి సృష్టించిన వారి మానసిక స్థితి చూస్తే బాధతో పాటు జాలి కలుగుతుందన్నారు. అసభ్యకరంగా మాట్లాడటాన్ని నేరంగా పరిగణించాలన్నారు.

రెహమాన్‌ ఒక లెజెండ్‌. నా కెరీర్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. నా జీవితానికి రోల్‌ మోడల్‌. నాకు సంగీతం నేర్పిన నా తండ్రిని నేను ఏడాది కిందట కోల్పోయాను. అప్పటి నుంచి ఈ బృందంలోని వారే సొంతవారిలా నన్ను ఆదరించారు. మీడియాకు వ్యక్తుల మనసుతో పనిలేదు. మీడియాలో వచ్చే కామెంట్స్‌ జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోలేరు. ఇలాంటి వార్తలు నా కెరీర్‌కు అంతరాయం కలిగించలేవు. దయచేసి వీటికి ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టండి. మా గోప్యతను గౌరవించండి అని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

మరోవైపు రెహమాన్‌ వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, యూట్యూబ్‌ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన లీగల్‌ టీమ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఏ సోషల్‌ మీడియా వేదికలోనైనా అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్‌ సూచించినట్లు తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News