అందుకే నయనతారకు సపోర్ట్ చేశా
ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ నిజంవైపు నిలబడుతానన్న పార్వతి తిరువోతు
ధనుష్-నయనతారల వివాదం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ వివాదంలో నయనతారకు పార్వతి తిరువోతు మద్దతుగా నిలిచారు. నయనతారకు ఎందుకు అండగా నిలిచారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమెకు మద్దతు ఇవ్వడం ఎంతో అవసరమన్నారు.
నయనతార తరఫున నిలవడం పెద్ద పని కాదు. దాని కోసం నా అదనపు టైమ్‌ను కేటాయించాల్సిన అవసరం లేదు. నేను ఆమె పోస్ట్ చూసిన వెంటనే షేర్ చేయాలనిపించింది. ఆమె గొప్ప వ్యక్తి. లేడీ సూపర్ స్టార్. తన కెరీర్‌ను తానే నిర్మించుకున్న మహిళ. కారణం లేకుండా ఇతరులను నిందించే మనిషి కాదు. ఆమె ఎదుర్కొన్న అనుభవాలను మూడు పేజీల లేఖ రాశారు. దాన్ని బహిరంగంగానే పోస్ట్ చేశారు. అందుకే అందులో తప్పులేదనిపించింది. ఆమెకు మద్దతు ఇవ్వాలనిపించింది. ఆమె లేఖలో నిజాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ ఏదో సందర్భంలో ఎదురవుతాయి. అలాంటప్పుడు ఎవరూ అండగా నిలవకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడూ నిజంవైపు నిలబడుతాను. ముఖ్యంగా వారు స్త్రీలు అయితే సపోర్టు ఇవ్వడంలో ముందుంటానని చెప్పారు.
నయనతార బహిరంగ లేఖ రాసిన తర్వాత పార్వతీ మొదట స్పందించారు. సెల్యూట్ ఎమోజీని పోస్ట్ చేస్తూ ఆ లేఖను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్, నజ్రియా, ఐశ్వర్యలక్ష్మి, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేశ్ తదితరులు నయన్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'నానుమ్ రౌడీ దాన్'కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ. 10 కోట్ల నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్ చేశారని నయనతారా ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారన్నారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి.