ఫేమ్, పాపులారిటీ కోసమే న్యూడ్ సీన్స్‌లో యాక్ట్ చేయను
'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' పలు సన్నివేశాలు వైరల్ కావడంపై స్పందించిన నటి దివ్య ప్రభ
దివ్య ప్రభ, కని కుశృతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'. పాయల్ కపాడియా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించి పలు సన్నివేశాలు వైరల్ కావడంపై నటి దివ్య ప్రభ స్పందించారు. ముఖ్యంగా న్యూడ్ సీన్ వైరల్‌గా మారడంపై ఆమె మాట్లాడారు. ఇది బాధాకరం అన్నారు.
ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందనలు వస్తాయని నేను ఊహించాను. నేను ఎన్నో కథలు వింటుంటాను. కథ నచ్చితేనే సినిమాలు చేస్తాను. పాత్రకు అనుగుణంగా నటిస్తాను. ఈ మూవీలోనూ రోల్ నాకెంతో నచ్చింది. ఇక ఇందులోని ఒక వీడియో ఇటీవల తెగ చెక్కర్లు కొడుతున్నది. ఎంతోమంది దాన్ని వైరల్ చేశారు. వాళ్లు ఎలాంటి వాళ్లో, వారి ఆలోచనా విధానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఫేమ్, పాపులారిటీ త్వరితగతిన పొందడం కోసమే న్యూడ్ సీన్లో యాక్ట్ చేశానని పలువురు అంటున్నారు. ఈ సినిమా కంటే ముందు నేను ఎన్నో అవార్డులు పొందాను. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాల్లో యాక్ట్ చేశాను. పేరు పొందడం కోసం ఇలాంటి సీన్స్‌లో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదని నా భావన అని తెలిపారు.
పాయల్ కపాడియా డైరెక్షన్లో వచ్చిన మొదటి ఫీచర్ సినిమా ఇదే కావడం గమనార్హం. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'. ఇద్దరు కలిసి ఓ బీచ్ టౌన్‌కు రోడ్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అన్నదే మూవీ కథాంశం. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు వచ్చాయి. కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుల కేటగిరీలో 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' పోటీలో నిలిచింది. తెలుగులో దీనిని రానా విడుదల చేశారు.