కేసీఆర్ ఎందుకీ మౌనం?
సెప్టెంబరు 17 నిర్వహణపై తెలంగాణలో విలీనం.. విమోచనం.. విద్రోహం ఇలా మూడు రకాల భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరి వాదనను వారు వినిపిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారంలోకి రాకముందు విలీనాన్ని అధికారికంగా జరపాలన్న కేసీఆర్ కూడా ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అస్సలు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ కూడా సెప్టెంబరు 17 గురించి మాట్లాడుతుండటం విడ్దూరం. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకున్న […]
Advertisement
సెప్టెంబరు 17 నిర్వహణపై తెలంగాణలో విలీనం.. విమోచనం.. విద్రోహం ఇలా మూడు రకాల భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరి వాదనను వారు వినిపిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారంలోకి రాకముందు విలీనాన్ని అధికారికంగా జరపాలన్న కేసీఆర్ కూడా ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అస్సలు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ కూడా సెప్టెంబరు 17 గురించి మాట్లాడుతుండటం విడ్దూరం. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకున్న విషయం మరిచి తెలంగాణ పోరాటంలో తామూ పాల్గొన్నాం..అన్నంత బిల్డప్ ఇస్తోంది. కమ్యూనిస్టులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తోంది. మరోపక్క తెలంగాణలో మిణుకుమిణుకు మంటున్న ఉనికిని కాపాడేందుకు టీడీపీ కూడా ఈ అంశాన్ని భుజానికెత్తుకోవడం విశేషం.
ఈ విషయంలో కమ్యూనిస్టులు బీజేపీపై అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ పోరాటాన్ని స్వాతంత్ర్య ఉద్యమంలా కాకుండా కేవలం హిందూ-ముస్లింల మధ్య గొడవలు తీసుకువచ్చే కోణంలో మాత్రమే బీజేపీ చూస్తోందని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. తమకు సంబంధం లేని విషయాన్ని తమ గొప్పలుగా చెప్పుకోవడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఆపరేషన్ పోలో అనంతరం కొన్ని ముస్లిం కుటుంబాలపై దాడులు జరిగిన మాట వాస్తవమే! కానీ, అంతమాత్రాన విలీన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించకూడదు అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ విమోచనం అని.. కమ్యూనిస్టులు విలీనమని, ముస్లింలు విద్రోహమని ఇలా ఎవరి డిమాండ్లు వారు బలంగానే వినిపిస్తున్నారు. ఇది అన్నివర్గాలకు సంబంధించిన అంశం. విమోచనం అన్న పదాన్ని కేసీఆర్ ఏనాడో పక్కనబెట్టేశారు. ఇక మిగిలింది విలీనం.. విద్రోహం. ఈ రెండింటి మధ్యే కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. విలీనమంటే ముస్లింలకు కోపం.. విద్రోహమంటే దేశభక్తులకు ఆగ్రహం కాబట్టి ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు కేసీఆర్. ఉద్యమపార్టీగా ఉన్న తమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది అని అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేసిన ప్రకటనకు ఆచరణ రూపమే ఈ మౌనం వెనక అసలు రహస్యం!
Advertisement