నయీం అనుచరుల వేట.. త్వరలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టు!
నయీం కేసు విషయంలో త్వరలో సంచలనాలు నమోదు కానున్నాయి. అతనితో సంబంధాలున్న నిందితులలో ఎవరినీ వదలకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండటం వారిని కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్త నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది. నయీం బతికున్నపుడు అతనికి ఎవరెవరు సహకరించారు? అందులో ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎంతమంది ఉన్నారు? అన్న జాబితాపై పోలీసులు కసరత్తు పూర్తి చేసిన అనంతరం డీజీపీ తుది నివేదికను సీఎంకు సమర్పించారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, […]
Advertisement
నయీం కేసు విషయంలో త్వరలో సంచలనాలు నమోదు కానున్నాయి. అతనితో సంబంధాలున్న నిందితులలో ఎవరినీ వదలకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండటం వారిని కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్త నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది. నయీం బతికున్నపుడు అతనికి ఎవరెవరు సహకరించారు? అందులో ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎంతమంది ఉన్నారు? అన్న జాబితాపై పోలీసులు కసరత్తు పూర్తి చేసిన అనంతరం డీజీపీ తుది నివేదికను సీఎంకు సమర్పించారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసులు ఉన్నారు. వీరి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వినాయక నిమజ్జనం ముగియగానే వీరందరినీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. నయీంతో సంబంధమున్న సొంతపార్టీ నేతలను కూడా వదలకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. నిందితుల జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ ప్రజాప్రతినిధులంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరిని అరెస్టు చేయడం ద్వారా ఎవరినీ ఉపేక్షించేదిలేదన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరిని అరెస్టు చేయడం ద్వారా నయీం విషయంలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన దరిమిలా.. నయీంతో సంబంధాలున్న ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం మొదలు పెడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా అసెంబ్లీలో ప్రతిపక్షాలపై మానసికంగా పైచేయి సాధించేలా పావులు కదుపుతోంది.
మరోవైపు పోలీసు శాఖలోనూ నయీం అనుచరుల వేట ప్రకంపనలు సృష్టిస్తోంది. నయీంను ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్న పోలీసుల జోలికి సిట్ అధికారులు వెళ్లడంలేదు. కానీ, నయీంతో కలిసి అమాయకులను బెదిరించి భూదందాలు చేసిన పోలీసులను వదిలే అవకాశాలు కనిపించడం లేదు. ఈ జాబితాలో డీజీపీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సై స్థాయి హోదాకు చెందిన మొత్తం 21 మంది పోలీసు అధికారుల పేర్లున్నాయి. ఐపీఎస్ అధికారుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుగా వారిని ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Advertisement