భళా! ముంబయి పోలీసులు....ఎంత మంచి పనిచేశారో!
సినిమా కంటే ఎక్కువ మలుపులున్న ఈ నిజజీవిత కథలో ముంబయి, కేరళ పోలీసులే హీరోలు. చెవిటి మూగ వాడయిన 14ఏళ్ల బాలుడు తప్పిపోగా…అనేక ప్రయత్నాలు చేసి తిరిగి అతడిని… తన అన్నవద్దకు చేర్చారు వారు. వివరాల్లోకి వెళ్లితే పదహారేళ్ల అనిల్, పద్నాలుగేళ్ల సునీల్ (ఇద్దరి పేర్లు మార్చబడ్డాయి) అన్నదమ్ములు. బీహార్ వాసులైన వీరు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే ఈ పిల్లల తల్లిదండ్రులు మరణించడంతో ఓ జంట వీరిని దత్తత తీసుకుంది. అక్కడ కూడా పేదరికం […]
సినిమా కంటే ఎక్కువ మలుపులున్న ఈ నిజజీవిత కథలో ముంబయి, కేరళ పోలీసులే హీరోలు. చెవిటి మూగ వాడయిన 14ఏళ్ల బాలుడు తప్పిపోగా…అనేక ప్రయత్నాలు చేసి తిరిగి అతడిని… తన అన్నవద్దకు చేర్చారు వారు. వివరాల్లోకి వెళ్లితే పదహారేళ్ల అనిల్, పద్నాలుగేళ్ల సునీల్ (ఇద్దరి పేర్లు మార్చబడ్డాయి) అన్నదమ్ములు. బీహార్ వాసులైన వీరు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే ఈ పిల్లల తల్లిదండ్రులు మరణించడంతో ఓ జంట వీరిని దత్తత తీసుకుంది. అక్కడ కూడా పేదరికం వెక్కిరించడంతో భరించలేకపోయిన అనిల్, తమ్ముడు సునీల్ని తీసుకుని ఏప్రిల్లో ముంబయి వచ్చేశాడు.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్టి) రైల్వే స్టేషన్ సమీపంలోని పేవ్మెంట్లే వారి నివాసం. అనిల్ ఒక టీ కొట్టులో పని సంపాదించుకుని తమ్ముడిని పోషిస్తుండేవాడు. తరువాత అతను సిఎస్టి సబ్వే ప్రాంతంలో ఉన్న ఒక షాపులో సేల్స్మెన్గా చేరాడు. రోజంతా ఖాళీగా ఉండే సునీల్ ఆ ప్రాంతంలో రోడ్లమీద తిరుగుతుండేవాడు. సెంట్ జేవియర్ కాలేజికి ఎదురుగా ఉన్న ముంబయి స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్లో జరిగే బాస్కెట్బాల్, ఇతర ఆటలను ఇష్టంగా చూస్తుండేవాడు. అయితే ఏప్రిల్ 21న సునీల్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. దాంతో అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఎస్టి పోలీసులు సిసిటివి ఫుటేజిని పరిశీలించారు…సునీల్ ఏదైనా రైలు ఎక్కేశాడేమో అనే అనుమానంతో. కానీ అందులో వారికి ఏ సమాచారం దొరకలేదు.
అయితే వారు అనుమానించినట్టుగానే సునీల్… కేరళ వెళ్లే రైలు ఎక్కాడు. రైలు దిగగానే… అతని వాలకం చూసి…తప్పిపోయినట్టుగా అర్థం చేసుకున్న కేరళ రైల్వే పోలీసులు సునీల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా… సునీల్ కేవలం బాస్కెట్ బాల్ ఆటని మాత్రమే తన సైగల ద్వారా చూపించాడు. దాంతో ఏం చేయాలో తోచని పోలీసులు అతనికి భారతదేశంలోని ప్రముఖ స్థలాలైన… గేట్వే ఆఫ్ ఇండియా లాంటివాటిని చూపించారు. సునీల్… ముంబయిలో తాము నివాసం ఉన్న సిఎస్టిని గుర్తుపట్టాడు. సునీల్ బాగోగులను ఒక స్థానిక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటూ ఉండేది. జూన్లో సునీల్ని ముంబయికి తీసుకువచ్చారు. మైనర్లను ఉంచే డోంగ్రి రిమాండ్ హోమ్లో అతడిని ఉంచారు.
తరువాత అతడిని జువెనైల్ ఎయిడ్ ప్రొటెక్షన్ యూనిట్కి తరలించారు. సామాజిక సేవా దృక్పథంతో ముంబయి పోలీసులు నిర్వహిస్తున్నప్రత్యేక సంస్థ అది. ఈ సంస్థ అధికారులు అతడిని అన్ని క్రీడాస్థలాలకు తిప్పటం మొదలుపెట్టారు. సునీల్ బాల్ని… బాస్కెట్లో వేస్తున్నట్టుగా…చేస్తున్న సైగలు మాత్రమే వారి ముందున్న ఆధారం మరి. చివరికి సిఎస్టి వద్దకు తీసుకువచ్చినపుడు అతడు సబ్వే వైపు వెళ్లటం మొదలుపెట్టాడు. దాంతో అధికారులు అక్కడ ఉన్నవారికి సునీల్ తెలుసా… అని విచారించారు. అయితే ఎవరూ అతడిని గుర్తుపట్టలేకపోయారు. అయినా అధికారులకు అతను ఆ ప్రాంతంలో నివసించి ఉంటాడ నే విషయం అర్థమైపోవటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని తిప్పసాగారు.
చివరికి వారు సెంట్ జేవియర్ కాలేజికి ఎదురుగా ఉన్న క్రీడా కేంద్రానికి రాగానే సునీల్కి ఆ స్థలం గుర్తొచ్చింది. అదే విషయం సైగల ద్వారా చెప్పాడు. ఒక చెరుకురసం అమ్ముకునే వ్యక్తి సునీల్ని గుర్తుపట్టాడు. సునీల్ సిఎస్టి షాపుల వైపు నుండి వస్తుండేవాడని చెప్పాడు. దాంతో పోలీసులు అతడిని అక్కడికి తీసుకుని వెళ్లి ప్రతి షాపు వద్ద విచారిస్తూ వెళ్లారు. చివరికి సునీల్ అన్న అనిల్ పనిచేస్తున్న షాపు వద్దకు కూడా వెళ్లటంతో సునీల్ని… అతని అన్నవద్దకు చేర్చడం సాధ్యమైంది. మాట్లాడలేని, వినలేని అలాంటి పిల్లవాడి నుండి సమాచారం సేకరించడం చాలా కష్టమని, కానీ తమ పోలీసుల బృందం ఆశని వదులుకోకుండా అనుకున్నది సాధించిందని సోషల్ సర్వీస్ బ్రాంచ్ డిసిపి ప్రవీణ్ పాటిల్ అన్నారు. పోలీసుల ప్రయత్నంతో అనిల్, సునీల్ల దత్తత తల్లిదండ్రులు ముంబయి వచ్చి…పిల్లలిద్దరినీ తమతో బీహార్ తీసుకువెళ్లారు.
Click on Image to Read: