ఇసుక దందా వెనక అదృశ్య శక్తి?
కుకునూరు పల్లి ఎస్సై రామక్రిష్ణారెడ్డి ఆత్మహత్య కేసు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇసుక దందాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు ఎస్సై ఆత్మహత్య ఊతమిచ్చేలా ఉంది. స్వయంగా సీఎం నియోజకవర్గంలో ఒక ఎస్సై, అందులోనూ మాజీ సైనికుడే ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడవడం వసూళ్ల దందా సాగుతున్న తీరుకు అద్దం పడుతోంది. డీఎస్పీకి రూ.15 లక్షలు, మరో సీఐకి లక్షలాది రూపాయలు ఇచ్చానని మృతుడు ఆత్మహత్యలేఖలో పేర్కొన్నదాన్ని బట్టి చూస్తే.. ఈ […]
కుకునూరు పల్లి ఎస్సై రామక్రిష్ణారెడ్డి ఆత్మహత్య కేసు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇసుక దందాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు ఎస్సై ఆత్మహత్య ఊతమిచ్చేలా ఉంది. స్వయంగా సీఎం నియోజకవర్గంలో ఒక ఎస్సై, అందులోనూ మాజీ సైనికుడే ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడవడం వసూళ్ల దందా సాగుతున్న తీరుకు అద్దం పడుతోంది. డీఎస్పీకి రూ.15 లక్షలు, మరో సీఐకి లక్షలాది రూపాయలు ఇచ్చానని మృతుడు ఆత్మహత్యలేఖలో పేర్కొన్నదాన్ని బట్టి చూస్తే.. ఈ స్టేషన్ పరిధిలో ఏ మేరకు వసూళ్లు జరుగుతున్నాయో తెలుస్తోంది.
మామూళ్ల కోసం తమ కిందిస్థాయి అధికారులను ఈ స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారంటే దీని వెనక కారణం ఏంటి? కిందిస్థాయి సిబ్బందిని వేధిస్తే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారన్న విషయం వారికి తెలియదా? అంటే అంతకంటే బలమైన శక్తులు ఏవో వారి వెనక ఉండి ఉంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానిస్టేబుళ్లు, తమ పై అధికారి మాట వినకుండా.. నేరుగా ఉన్నతాధికారికి తప్పుడుఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటున్న అధికారులు, ఎస్సై ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఈ ప్రశ్నలన్నీ ప్రజాప్రతినిధులపైనే వేలెత్తి చూపుతున్నాయి. ప్రాణాలు తీసుకునే ముందు ఎస్సై రామక్రిష్ణారెడ్డి పలువురు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నా.. పరిస్థితుల్లో మార్పు రాలేదంటే.. వారందరూ వెనకడుగు వేశారా? అయితే.. ఆ వెనకడుగు ఎందుకు? ఎస్సై ఫిర్యాదును కావాలనే పక్కన బెట్టారా? దీని వెనక ఉన్న అజ్ఞాత శక్తి ఎవరు? అన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Click on Image to Read: