సర్కారుకు కోదండరామ్ ముప్పు!
తెలంగాణలో ఉపాధి, ఉద్యోగాలకు మరో ఉద్యమం చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. కోదండరామ్ ప్రకటనతో సర్కారు ఉలిక్కిపడింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారనుకున్న కోదండరామ్ ఈసారి చేయబోయే ఉద్యమానికి డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేసుకుని రావడమే ఇందుకు కారణం. దసరా తరువాత నుంచి ఉద్యోగాల కోసం యువతతో కలిసి పోరుబాట పడతామని ప్రకటించి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పడేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రకటన జారీ చేయాలని అల్టిమేటం […]
Advertisement
తెలంగాణలో ఉపాధి, ఉద్యోగాలకు మరో ఉద్యమం చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. కోదండరామ్ ప్రకటనతో సర్కారు ఉలిక్కిపడింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారనుకున్న కోదండరామ్ ఈసారి చేయబోయే ఉద్యమానికి డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేసుకుని రావడమే ఇందుకు కారణం. దసరా తరువాత నుంచి ఉద్యోగాల కోసం యువతతో కలిసి పోరుబాట పడతామని ప్రకటించి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పడేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రకటన జారీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కోదండరామ్ మొదటి నుంచి యువత కోసమే పోరాడుతున్నారు. 2015లో జూన్ 2న తొలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు ముందు కూడా కోదండరామ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకుంటే, ఇంతటి ఘాటుగా కాకుండా.. వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారని తొలి రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఉద్యోగ ప్రకటన చేయాలని కోరారు. కోదండరామ్ చేసిన ఈ డిమాండ్‌తో సర్కారులో కదలిక వచ్చింది. అనుకున్నట్లుగా వేదిక మీద నుంచే కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారు. ఈ పరిణామం తరువాత కోదండరామ్ – ప్రభుత్వం మధ్య విభేదాలు రెట్టింపయ్యాయి.
ఆ తరువాత దాదాపు ఏడెనిమిది నెలలు మౌనంగానే ఉన్న కోదండరామ్ జేఏసీలో చీలిక రావడంపై స్పందించారు. ఎవరేమనుకున్నా జేఏసీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కెనడాపర్యటన తరువాత కోదండరామ్ ప్రభుత్వంపై ఒకరకంగా యుద్ధమే ప్రకటించారని చెప్పాలి. తెలంగాణ వచ్చినా.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఆయన చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. అంతే, దాదాపు 10 మంది మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి ఖండించారు. దీంతో ఆయనంటే ఎందుకంత భయమని ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గారు మంత్రులు. తాజాగా కోదండరామ్ చేసిన ప్రకటనపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఉద్యోగాలకు ప్రకటన జారీ చేస్తుందా? లేదా ఆయనపై విమర్శలతోనే సరిపెడుతుందా? అన్నది ప్రధాని పర్యటన తరువాత తేలిపోనుంది.
Advertisement