ఆరేళ్లుగా లీకేజీలా?
తీగ లాగుతుంటే డొంకంతా కదిలినట్లుగా.. ఎంసెట్-2 లీకేజీ దర్యాప్తులో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇంతకాలం ఎంసెట్-2 పేపర్ మాత్రమే లీకైందని అనుకున్నవారంతా మొదటి పేపర్ కూడా లీకైందని తెలిసి హతాశయులయ్యారు. ఇదంతా కానే కాదు… 2012 నుంచి వరుసగా ఎంసెట్‌లో లీకేజీలు జరుగుతూనే ఉన్నాయని ఓ పత్రిక ఈ రోజు ప్రచురించిన సంచలన కథనం తెలుగు రాష్ర్టాల విద్యావ్యవస్థపై బాంబు వేసినంత పని చేసింది. లీకేజీల సూత్రధారుల పిల్లలు, ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల అన్నలు, […]
Advertisement
తీగ లాగుతుంటే డొంకంతా కదిలినట్లుగా.. ఎంసెట్-2 లీకేజీ దర్యాప్తులో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇంతకాలం ఎంసెట్-2 పేపర్ మాత్రమే లీకైందని అనుకున్నవారంతా మొదటి పేపర్ కూడా లీకైందని తెలిసి హతాశయులయ్యారు. ఇదంతా కానే కాదు… 2012 నుంచి వరుసగా ఎంసెట్‌లో లీకేజీలు జరుగుతూనే ఉన్నాయని ఓ పత్రిక ఈ రోజు ప్రచురించిన సంచలన కథనం తెలుగు రాష్ర్టాల విద్యావ్యవస్థపై బాంబు వేసినంత పని చేసింది. లీకేజీల సూత్రధారుల పిల్లలు, ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల అన్నలు, అక్కలు లీకేజీ పుణ్యమాని ఇప్పటికే ఎంబీబీఎస్‌లు పూర్తి చేసి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని తెలిసి సీఐడీ అధికారులు బిత్తరపోయారు. దీనికితోడు మేము కేవలం మధ్యవర్తులమే.. అసలు వ్యక్తులు వేరే ఉన్నారు.. అంటూ దొరికినవారంతా చెప్పడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు సీఐడీ అధికారులు.
ఇక కీలక నిందితుడిగా భావిస్తోన్న రాజగోపాల్ రెడ్డి 2012 నుంచి వీలు చిక్కినప్పుడల్లా లీకేజీకి పాల్పడుతూనే ఉన్నానని విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన తిరుమల్ ఎంసెట్ -2 లీకేజీకి సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈయన కుమారుడు ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇప్పుడు తిరుమల్ కుమారుడి ఎంబీబీఎస్ పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సీఐడీ చీఫ్ ఆదివారం పదవీవిరమణ చేయడంతో కేసు బాధ్యతలను ఐజీ సౌమ్యామిశ్రాకు తాత్కాలికంగా కేసు బాధ్యతలు అందజేశారు. ఈ అంశంలో పలు సాంకేతిక అంశాలు కూడా ముడిపడి ఉండటంతో సీఐడీ సాంకేతిక విభాగం కూడా రంగంలోకి దిగనుందని తెలిసింది. లీకేజీ ద్వారా ముందే ప్రశ్నలు పొందిన విద్యార్థుల్లో 90 శాతం అమ్మాయిలే ఉండటం గమనార్హం. కేసు పురోగతికి సంబంధించిన విషయాలు వెల్లడించేందుకు సీఐడీ పోలీసులు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో ఏం కొత్త విషయం చెబుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Advertisement