మంత్రుల రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి!
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం కడియం, లక్ష్మారెడ్డిల మెడకు చుట్టుకునేలా ఉంది. ఎంసెట్-2 లీకేజీ కి నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. లీకేజీ వ్యవహారం తీగలాగితే దాని డొంకలు దేశం నలుమూలలా కదులుతున్నాయి. దీని వెనక సూత్రధారులు ఎవరెవరు అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా ఎంసెట్ -2 పరీక్ష రాసి క్వాలిఫై అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన వారిని రోడ్డెక్కేలా […]
Advertisement
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం కడియం, లక్ష్మారెడ్డిల మెడకు చుట్టుకునేలా ఉంది. ఎంసెట్-2 లీకేజీ కి నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. లీకేజీ వ్యవహారం తీగలాగితే దాని డొంకలు దేశం నలుమూలలా కదులుతున్నాయి. దీని వెనక సూత్రధారులు ఎవరెవరు అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా ఎంసెట్ -2 పరీక్ష రాసి క్వాలిఫై అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన వారిని రోడ్డెక్కేలా చేసింది. కష్టపడి ర్యాంకులు తెచ్చుకుని తీరా మెడలో స్టెతస్కోప్ వేసుకునే కల సాకారమయ్యే క్షణానికి.. జరిగిన పరీక్ష తూచ్! అంటూ ప్రభుత్వం ప్రకటించడం వారికి తీరని శోకాన్నే మిగిల్చింది. అందుకే, కడుపుమండిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు.
మేధావులు, ప్రతిపక్షాలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలకడంతో ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజిల్లాలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు నిరసనలు వ్యక్తం చేశారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మా పేపర్ లీకైందని పరీక్ష రద్దు చేశారు బాగానే ఉంది. మా విశ్వాసం కోల్పోయిన మీరు రాజీనామా చేసి తిరిగి గెలవండి! అంటూ విద్యార్థులు సంధిస్తోన్న సూటి ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేకపోయింది. మరోవైపు నల్లగొండలో ఇదే విషయంలో ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ విషయంలో ప్రభుత్వంలో భాగస్వాములు, అధికారపార్టీకి చెందిన వారు లేకపోవడం ప్రభుత్వానికి కాస్త ఊరటినిచ్చే అంశం. పేపర్ లీకేజీ ఢిల్లీ నుంచి జరగడం, నిందితులంతా ఇతర రాష్ర్టాలవారే కావడంతో గుడ్డిలో మెల్లలా అధికార పార్టీ దర్యాప్తు వేగం పెంచేలా చేసింది. సుమారు 300 మంది పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా నిందితుల కోసం గాలిస్తుండటం విశేషం. మొత్తానికి ఈ వ్యవహారంలో మంత్రులు రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతున్నా.. అది కార్యరూపం అయ్యేలా కనిపించడం లేదు.
Advertisement