కేసీఆర్ అమరావతిలో దీక్ష చేస్తాడా?
హైకోర్టు విషయంలో కేంద్రం చేస్తోన్న జాప్యానికి నిరసనగా తెలంగాణ సీఎం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తాడంటూ వెలువడిన వార్తలపై బీజేపీ కాస్త ఆలస్యంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టు విభజనపై నోరు విప్పారు. హైకోర్టు విషయంలో కేసీఆర్ కేంద్రాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఇది కేవలం రెండు రాష్ర్టాల సీఎంలు కూర్చుని మాట్లాడుకునే విషయమని స్పష్టం చేశారు. హైకోర్టు విభజన విషయంలో ఇంతకాలం జాప్యం చేసి, ఇప్పుడు కేంద్రాన్ని దోషిగా చూపించే […]
Advertisement
హైకోర్టు విషయంలో కేంద్రం చేస్తోన్న జాప్యానికి నిరసనగా తెలంగాణ సీఎం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తాడంటూ వెలువడిన వార్తలపై బీజేపీ కాస్త ఆలస్యంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టు విభజనపై నోరు విప్పారు. హైకోర్టు విషయంలో కేసీఆర్ కేంద్రాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఇది కేవలం రెండు రాష్ర్టాల సీఎంలు కూర్చుని మాట్లాడుకునే విషయమని స్పష్టం చేశారు. హైకోర్టు విభజన విషయంలో ఇంతకాలం జాప్యం చేసి, ఇప్పుడు కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం తగదని హితవు పలికారు. హైకోర్టు విభజనకు కేసీఆర్ దీక్ష చేయాల్సింది.. ఢిల్లీలో కాదు.. అమరావతిలో.. అక్కడ చేస్తే.. ఫలితం ఉంటుందని సూచించారు.
తెలంగాణలో న్యాయాధికారులు, న్యాయమూర్తులు సస్పెండ్ కావడానికి కేసీఆర్ చేసిన జాప్యమే కారణమని ఆరోపించారు. ఇంతకాలం ఈ విషయంపై ఎందుకు తాత్సారం చేస్తూ వచ్చారని సూటిగా స్పందించారు. ఇద్దరు సీఎంలు ఒకరికొకరు బాగానే ఉంటున్నారు కదా అని గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ ఇంటికి చండీయాగానికి చంద్రబాబు వచ్చారు. ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి కదా! మరి ఈ విషయంలో ఇద్దరు కూర్చుని ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. మీరు – మీరు తేల్చుకోవాల్సిన విషయాన్ని తమ పార్టీపై రుద్దడం సరికాదని హితవు పలికారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానంటేనే.. అది జాతీయ వార్త అయి కూర్చుంది. నిజంగా లక్ష్మణ్ చెప్పినట్లు కేసీఆర్ వెళ్లి అమరావతిలో దీక్ష చేస్తే.. అది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని తెలియదా? అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్య మరింత జఠిలం కాకముందే ఇద్దరు సీఎంలు సాధ్యమైనంత త్వరగా తేల్చాలని ఇటు న్యాయాధికారులు అటు తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement