ఆర్టీసీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్!
తెలంగాణ ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రముఖ పాత్రికేయులు నాగేశ్వర్ పలు సూచనలు చేశారు. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సర్కారుకు సవాలు విసిరారు. కానీ, దానిపై ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ, అధికార పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టు.. అన్నట్లుగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో నడిచింది. రాష్ట్ర విభజన అనంతరం.. పరిస్థితిలో […]
Advertisement
తెలంగాణ ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రముఖ పాత్రికేయులు నాగేశ్వర్ పలు సూచనలు చేశారు. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సర్కారుకు సవాలు విసిరారు. కానీ, దానిపై ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ, అధికార పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టు.. అన్నట్లుగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో నడిచింది. రాష్ట్ర విభజన అనంతరం.. పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడం సంస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
దీనికి పాలకులు, అధికారుల తీరే కారణమన్న కార్మిక నాయకుల వాదనను ఎవరూ కాదనలేక పోతున్నారు. ఆర్టీసీలో లాభాల మాట పక్కనబెడితే.. కనీసం అప్పుల నుంచి గట్టెక్కితే చాలన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. దీనికి తోడు ప్రయివేటీకరణ కత్తి ఆర్టీసీపై ఎప్పటి నుంచో వేలాడుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు పదేపదే ఛార్జీలు పెంచడం మినహా పాలకులు చేస్తోన్న ప్రయత్నాలు పెద్దగా లేవు.
నష్టాలను సాకుగా చూపుతూ.. ప్రతిసారీ ఛార్జీలు పెంచడాన్ని ఆర్టీసీ కార్మిక నాయకులతోపాటు, పలువురు మేధావులు కూడా తప్పు బడుతున్నారు. ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆర్టీసీ నిర్వహణలో పలు మార్పులు రావాలని సూచిస్తున్నారు. తన వ్యాఖ్యల్లో ఒక్కటి తప్పని నిరూపించినా.. ఇక మీదట మైక్ ముట్టనని సర్కారుకు సవాలు విసిరారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
1. ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు నడుస్తోన్న ప్రయివేటు బస్సులను నియంత్రిస్తే.. తెలంగాణ ఆర్టీసీకి ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వస్తుంది.
2. నష్టాలు వస్తున్న రూట్లలో ఆర్టీసీ సంస్థ సొంత బస్సులను మాత్రమే నడపాలి.
3. లాభాలు వస్తున్న బాటలో ప్రయివేటు బస్సులకు అవకాశం ఇవ్వకూడదు.
4. అద్దె బస్సుల పర్మిట్లలో అధికారులు, ఎమ్మెల్యేలే బినామీ పేర్లతో బస్సులు తిప్పుతున్నారు. ఈ పరిస్థిని పూర్తిగా అరికట్టాలి.
5. బస్సులు, వస్తువుల కొనుగోళ్లు, సదుపాయాల కల్పనలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడకుండా చర్యలు తీసుకోవాలి.
6. ఆర్టీసీకి ఇంధన కొరతను తీర్చేలా సొంత డీజిల్ బంకులను ఏర్పాటు చేయాలి.
ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నిసార్లు చార్జీలు పెంచినా ఆర్టీసీ మెరుగుపడదు, లాభాల బాట పట్టదు అని ఆయన చెబుతున్నారు.
Advertisement