అప్పట్లో బీదర్.. ఇప్పుడు నేపాల్!
ఇదేంటి..? దిల్ సినిమాలో వేణు మాధవ్ డైలాగులా ఉందనుకుంటున్నారా? దాదాపు అలాంటిదే..కాకపోతే సందర్భం వేరు. ప్రస్తుతం తెలుగువారందరికీ అప్పట్లో బీదర్.. బళ్లారి..యానాంల పేర్లు సుపరిచితమే. ఎందుకో మీ అందరికీ చెప్పలేదనుకుంటా. అనుమానం లేదు.. మీ ఊహ కరక్టే! వీరంతా మందుబాబులే! కారణం అపట్లో (1994లో) ఎన్టీఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసింది. దీంతో మందుబాబులు తెలివి మీరారు. ఏపీలో తాగితే తప్పు కానీ పొరుగు రాష్ర్టాల్లో కాదు కదా! ఇదే పాయింట్‌తో అప్పటి ఏపీకి […]
ఇదేంటి..? దిల్ సినిమాలో వేణు మాధవ్ డైలాగులా ఉందనుకుంటున్నారా? దాదాపు అలాంటిదే..కాకపోతే సందర్భం వేరు. ప్రస్తుతం తెలుగువారందరికీ అప్పట్లో బీదర్.. బళ్లారి..యానాంల పేర్లు సుపరిచితమే. ఎందుకో మీ అందరికీ చెప్పలేదనుకుంటా. అనుమానం లేదు.. మీ ఊహ కరక్టే! వీరంతా మందుబాబులే! కారణం అపట్లో (1994లో) ఎన్టీఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసింది. దీంతో మందుబాబులు తెలివి మీరారు. ఏపీలో తాగితే తప్పు కానీ పొరుగు రాష్ర్టాల్లో కాదు కదా! ఇదే పాయింట్‌తో అప్పటి ఏపీకి సరిహద్దులో ఉన్న బీదర్.. బళ్లారి, యానాంలకు విహారయాత్రల పేరిట వెళ్లేవారు. హైదరాబాద్‌లో ఉండేవారికి బీదర్ కేవలం 90 కి.మీ.లే కావడంతో కనీసం వారానికి ఒకసారైనా బీదర్‌ను పలకరించి వచ్చేవారు.
ఇప్పుడు ఇదే పరిస్థితి బీహార్ వాసులకు ఎదురవుతోంది. అక్కడ ఇటీవల అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ఎన్నికల హామీల అమలులో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ నేరాల శాతం 27 వరకు తగ్గిందని చెబుతున్నారు. అయితే, ఎవరికి ఏమైతే మాకేం? అనుకున్న బీహార్ మందుబాబులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే పక్కదేశంపై పడ్డారు. కాలినకడన నేపాల్‌కు వెళ్లి ఫూటుగా తాగి వస్తున్నారు. పైగా పాస్‌పోర్టులు కూడా అవసరం లేకపోవడంతో అక్కడి పబ్‌లు, బార్లలో తాగి చిందులు వేస్తున్నారు. ఎంతైనా విహారయాత్ర కదా! చాలారోజుల తరువాత మందు కనిపించే సరికి బాబులు ఆపుకోలేక పీకలదాకా తాగుతున్నారు. పోనీ.. తాగి ఊరుకుంటున్నారా? అదీ లేదు. అక్కడ నానాయాగీ చేయడం, బార్ డాన్సర్లను వేధించడం వంటి ఆకతాయి పనులకు పాల్పడుతున్నారు. తాజాగా బిహార్ కు చెందిన 70 మంది తాగుబోతులను నేపాల్ పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపారు.
బీహార్ వాసులు నేపాల్ ను ఎంచుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. భౌగోళికంగా దగ్గరగా ఉండటం, అసలు విషయం ఏంటంటే మన రూపాయి అక్కడ రెండు రూపాయలు. ఇక్కడ ఒక పెగ్గు తాగితే.. అవే డబ్బులతో అక్కడ రెండు పెగ్గులు తాగవచ్చన్నమాట. పాపం మందుబాబుల ముందు చూపు బాగానే ఉన్నా.. తాగి వాగి..నానా యాగి చేయడంతోనే చిక్కులు ఎదురవుతున్నాయి.