రాజారెడ్డి హత్యకు 18 ఏళ్లు... ఆ రోజు ఏం జరిగింది?

(తెలుగు గ్లోబల్.కామ్ ప్రత్యేకం) వైఎస్ రాజారెడ్డి హత్య జరిగి నేటికి 18 ఏళ్లు అయింది. 1998 మే 23 మధ్యాహ్నం రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ రోజు భారీగా వర్షం రావడంతో ఇడుపులపాయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు రాజారెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న‌ సమయంలో తిరిగి జీపులో ఇంటికి వస్తున్న సమయంలో దాడి జరిగింది. వర్షం నీరు కారణంగా వేముల సమీపంలోని కల్వర్ట్ దగ్గర జీపు స్లో అవగానే ప్రత్యర్థులు దాడి చేశారు. […]

Advertisement
Update:2016-05-23 05:32 IST

(తెలుగు గ్లోబల్.కామ్ ప్రత్యేకం)

వైఎస్ రాజారెడ్డి హత్య జరిగి నేటికి 18 ఏళ్లు అయింది. 1998 మే 23 మధ్యాహ్నం రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ రోజు భారీగా వర్షం రావడంతో ఇడుపులపాయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు రాజారెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న‌ సమయంలో తిరిగి జీపులో ఇంటికి వస్తున్న సమయంలో దాడి జరిగింది. వర్షం నీరు కారణంగా వేముల సమీపంలోని కల్వర్ట్ దగ్గర జీపు స్లో అవగానే ప్రత్యర్థులు దాడి చేశారు.

తొలుత బాంబులు విసిరారు. జీపు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో బాంబు జీపు అద్దాలపై పడింది. మూడో బాంబు నేరుగా రాజారెడ్డి తలకు తగిలింది. అనంతరం వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో రాజారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. రాజారెడ్డి అనుచరుల ప్రతిదాడిలో ప్రధాన నిందితుడు టీడీపీ నేత పార్థసారథిరెడ్డి సోదరుడు ఉమామహేశ్వరెడ్డి తీవ్రంగా గాయపడి అనంతరం చనిపోయారు.

రాజారెడ్డి హత్య విషయం తెలియడంతో కడపలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రతిదాడి తప్పదన్న భయంతో పార్థసారథి ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు పారిపోయారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనూ దాడులు జరుగుతాయన్న ఉద్దేశంతోనే పార్థసారథి సోదరుడిని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారని చెబుతుంటారు. అందుకే అతడు ప్రాణాలు కోల్పోయాడు. రాజారెడ్డి హత్య గురించి తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, అభిమానులు ప్రతిదాడులు చేయాలనుకున్నారు. పార్థసారథితో పాటు టీడీపీ నేతల ఇళ్లు, ఆస్తులను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే జిల్లాలో పరిస్థితి అదుపు తప్పిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్ హుటాహుటీనా పులివెందుల వచ్చారు.

అప్పుడు వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. పులివెందుల వచ్చిన వైఎస్… ఎక్కడా కూడా ప్రతిదాడులు జరగడానికి వీళ్లేదని తన అనుచరులకు గట్టిగా ఆదేశించారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులకు విధ్వంసం తప్పింది. తన తండ్రిని చంపిన వారిని చట్టానికే వదిలేద్దామని ప్రతిదాడులు చేయవద్దని వైఎస్ సూచించారు. దీంతో కడప జిల్లాలో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. రాజారెడ్డిని చంపిన పార్థసారథి, ఆయన అనుచరులకు చంద్రబాబు స్వయంగా తన నివాసంలోనే ఆశ్రయం కల్పించారని పెద్దెత్తున ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇంట్లో దాచినట్టు ఆరోపణలు రావడంతో తర్వాత వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉంచారని చెబుతుంటారు. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాలను పర్యవేక్షిస్తుంటే రాజారెడ్డి జిల్లాలో రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. జిల్లాలో వైఎస్‌ను బలహీనపరచాలంటే రాజారెడ్డి అడ్డుతొలగించాలన్న ఉద్దేశంతోనే టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. వారు సుప్రీం కోర్టుకు వెళ్లగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే ఇటీవల టీడీపీ అధికారంలోకి రావడంతో హంతకులు మళ్లీ విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరిలో రాజారెడ్డి హంతకులకు చంద్రబాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. రాజారెడ్డి హత్య జరిగిన సమయంలోనూ చంద్రబాబే సీఎంగా ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News