టీనేజి పిల్లల్లో నిద్ర తక్కువైతే....!
టీనేజి పిల్లల్లో నిద్ర తక్కువైతే రిస్క్‌ని లెక్కచేయని స్వభావం, అజాగ్రత్త పెరుగుతున్నాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ఏడు గంటలు అంతకంటే తక్కువగా నిద్రపోతున్న పిల్లలు ప్రయాణాలు చేస్తున్నపుడు సీట్ బెల్ట్‌ని పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ రూల్సుని అతిక్రమించడం, తాగి డ్రైవ్ చేయడం, ఫోన్ వాడుతూ వాహనాలు నడపటం లాంటి పనులు చేస్తున్నట్టుగా గుర్తించారు. 50వేలమంది విద్యార్థులపై నిర్వహించిన ఈ అధ్యయనం నుండి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రాల్లో వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తగా […]
టీనేజి పిల్లల్లో నిద్ర తక్కువైతే రిస్క్‌ని లెక్కచేయని స్వభావం, అజాగ్రత్త పెరుగుతున్నాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ఏడు గంటలు అంతకంటే తక్కువగా నిద్రపోతున్న పిల్లలు ప్రయాణాలు చేస్తున్నపుడు సీట్ బెల్ట్‌ని పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ రూల్సుని అతిక్రమించడం, తాగి డ్రైవ్ చేయడం, ఫోన్ వాడుతూ వాహనాలు నడపటం లాంటి పనులు చేస్తున్నట్టుగా గుర్తించారు. 50వేలమంది విద్యార్థులపై నిర్వహించిన ఈ అధ్యయనం నుండి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రాల్లో వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ అన్నే వీటన్ ఈ వివరాలు ప్రకటించారు. నిద్ర తక్కువైన పిల్లలు, మిగిలిన వారికంటే ఎక్కువగా అనుకోని ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారని అన్నే అన్నారు. అంతేకాదు, పది గంటలు, అంతకంటే ఎక్కువగా నిద్రపోతున్న టీనేజి పిల్లలు కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తున్నారని అధ్యయనంలో తేలింది. అంటే ఎనిమిది, తొమ్మిది గంటల కంటే నిద్ర ఎక్కువైనా తక్కువైనా పిల్లల్లో ప్రమాదాలను కొనితెచ్చుకునే ప్రవర్తన పెరుగుతున్నదని తెలుస్తోంది. వారిలో అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యం లాంటి లక్షణాలు పెరిగిపోతున్నాయి.
నిద్ర మరీ ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు ఉంటాయని, నిద్ర సరైన మోతాదులో లేకపోతే యాక్సిడెంట్లకు కారణం కావచ్చని ఇప్పటికే రుజువైనా, టీనేజి పిల్లల ప్రవర్తనని నిద్ర ఇంతగా మారుస్తుందని తెలుసుకోవడం ఇదే ప్రథమమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా అది వారి మానసిక స్వభావాన్ని మార్చేయడం ఆశ్చర్యకరంగా ఉందని వారు అంటున్నారు. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా వారిలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే గుణం తగ్గిపోతున్నదని, ప్రమాద కారకాలైన పనులను కావాలనే చేస్తున్నారని వారు హెచ్చరిస్తున్నారు.
టీనేజి పిల్లలు రాత్రులు ఎక్కువగా మేలుకుంటే వారు టివి, కంప్యూటర్, ఫోన్‌లాంటివాటితోనే గడుపుతున్నారని, అలాంటివాటితో ఎక్కువ సమయం ఉన్నపుడు ఆ లైట్ల వెలుతురు కారణంగా త్వరగా నిద్రలోకి వెళ్లలేరని, పడుకున్నా కనీసం ఒక గంట వరకు నిద్రపోలేరని అమెరికాలోని ఒక పిల్లల వైద్య నిపుణుడు చెబుతున్నారు. ఎంత ఎక్కువగా కృత్రిమ వెలుతురులో లైట్ల కాంతిలో ఉంటే అంత ఎక్కువగా నిద్రని కలిగించే హార్మోన్ మెలటోనిన్ తగ్గిపోతుందని, దానివలన నిద్రతగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.