అంచనాలు ఆకాశంలో...వాస్తవాలు పాతాళంలో...కాగ్ కడిగేసింది!
తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌గా, ఆకర్షణీయమైన అంకెలను కూర్చి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాగ్ (భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్)నివేదిక విమర్శలు కురిపించింది. బడ్జెట్ పూర్తిగా అవాస్తవికమైన అంచనాలతో ఉందని తెలిపింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టి అందులో కేవలం రూ. 64,097 కోట్లు మాత్రమే వ్యయం చేశారని వెల్లడించింది. మార్చి 2015 ఆర్థిక సంవత్సరానికి తన నివేదికని ఇచ్చిన కాగ్, బడ్జెట్‌లోని పలుఅంశాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. అంచనాలకు, ఆచరణలో వాస్తవాలకు […]
తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌గా, ఆకర్షణీయమైన అంకెలను కూర్చి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాగ్ (భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్)నివేదిక విమర్శలు కురిపించింది. బడ్జెట్ పూర్తిగా అవాస్తవికమైన అంచనాలతో ఉందని తెలిపింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టి అందులో కేవలం రూ. 64,097 కోట్లు మాత్రమే వ్యయం చేశారని వెల్లడించింది. మార్చి 2015 ఆర్థిక సంవత్సరానికి తన నివేదికని ఇచ్చిన కాగ్, బడ్జెట్‌లోని పలుఅంశాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. అంచనాలకు, ఆచరణలో వాస్తవాలకు ఎంతో వ్యత్యాసం ఉందని, ద్రవ్యపర్యవేక్షణ అనేది పూర్తిగా లోపించిందని కాగ్ నివేదిక పేర్కొంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కాగ్ నివేదికని బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
2015-16 సంవత్సరం బడ్జెట్ కూడా లక్షకోట్లకు మించి ఉండటంతో గతవారం ప్రతిపక్షాలు ఇదే విషయంమీద ప్రభుత్వాన్ని నిలదీశాయి. అంచానాలు ఎక్కువగానూ వ్యయం తక్కువగా ఉండటం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆ వెంటనే వచ్చిన కాగ్ నివేదికలోనూ తెలంగాణ ప్రభుత్వ తొలిబడ్జెట్ మీద అవే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం, తనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పథకాలుగా చెప్పుకున్న వాటికి కేటాయించిన నిధుల మొత్తాన్ని కూడా ఖర్చు చేయలేకపోయిందని, బడ్జెట్లో అవాస్తవిక అంచనాలు, భారీ మిగుళ్లు, అవసరం లేని చోట అనవసరంగా నిధులు కేటాయింపులు లాంటి లొసుగులు చాలా ఉన్నాయని, శాఖల నుంచి నిర్దిష్ట వివరాలు లేకుండానే రూ.2,555 కోట్ల మేర గంపగుత్త కేటాయింపులు జరిపారని కాగ్ పేర్కొంది. విధివిధానాలను ఖరారు చేయకపోవడం, అనుమతులను ఇవ్వడంలో పాలనాపరమైన జాప్యం కారణంగా ఏ పథకాలకు కూడా ప్రభుత్వం అంచనాలకు తగినట్టుగా ఖర్చుచేయలేకపోయిందని తెలిపింది. మిషన్ భగీరథ, హరిత హారం, వాటర్‌గ్రిడ్, కల్యాణ లక్ష్మి, యాదగిరి గుట్టకు కేటాయింపులు, సోలార్ పంపుసెట్లకు రాయితీలు, తెలంగాణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం…ఇలా పలు పథకాలకు కేటాయించిన నిధులకు, వాస్తవంలో వ్యయం చేసిన మొత్తాలకు ఉన్న తేడాలను కాగ్ ఎత్తిచూపింది. మధ్యాహ్న భోజన పథకానికి అంచనా వ్యయం 581.53 కోట్లు ఉంటే 282.92 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేశారని పేర్కొంది.