సాక్షి... వాట్ ఈజ్ దిస్!

సాక్షి. వైసీపీ అభిమానుల‌కు ఇష్ట‌మైన మీడియా సంస్థ‌. టీడీపీ, చంద్ర‌బాబు చేసే త‌ప్పుల‌ను తెలుసుకోవాల‌నే వారికీ అదో వేదిక‌. చంద్ర‌బాబు త‌ప్పుల‌ను ఎత్తిచూప‌డంలో బాగానే ప‌ని చేస్తుంటుంది. కానీ వైసీపీపై మిగిలిన చాన‌ళ్లు అన్నీ మూకుమ్మ‌డిగా దాడి చేసిన‌ప్పుడు మాత్రం మౌన‌మే వ్యూహ‌మ‌న్న‌ట్టుగా ఆ చాన‌ల్ తీరు ఉంటోంది. భూమా ఎపిసోడ్ తో ఈ విషయం మరోసారి రుజువైంది. భూమానాగిరెడ్డితో పాటు ఐదుగురు కర్నూలు ఎమ్మెల్యేలు వైసీపీ వీడి వెళ్తున్నార‌ని టీడీపీ అనుకూల‌, త‌ట‌స్థంగా ఉన్న‌ట్టు న‌టించే […]

Advertisement
Update:2016-02-21 14:58 IST

సాక్షి. వైసీపీ అభిమానుల‌కు ఇష్ట‌మైన మీడియా సంస్థ‌. టీడీపీ, చంద్ర‌బాబు చేసే త‌ప్పుల‌ను తెలుసుకోవాల‌నే వారికీ అదో వేదిక‌. చంద్ర‌బాబు త‌ప్పుల‌ను ఎత్తిచూప‌డంలో బాగానే ప‌ని చేస్తుంటుంది. కానీ వైసీపీపై మిగిలిన చాన‌ళ్లు అన్నీ మూకుమ్మ‌డిగా దాడి చేసిన‌ప్పుడు మాత్రం మౌన‌మే వ్యూహ‌మ‌న్న‌ట్టుగా ఆ చాన‌ల్ తీరు ఉంటోంది. భూమా ఎపిసోడ్ తో ఈ విషయం మరోసారి రుజువైంది.

భూమానాగిరెడ్డితో పాటు ఐదుగురు కర్నూలు ఎమ్మెల్యేలు వైసీపీ వీడి వెళ్తున్నార‌ని టీడీపీ అనుకూల‌, త‌ట‌స్థంగా ఉన్న‌ట్టు న‌టించే చాన‌ళ్లు మూకుమ్మ‌డిగా దాడి చేస్తుంటే సాక్షి మాత్రం ఎంచ‌క్కా ఎంట‌ర్‌టైన్ మెంట్ కార్య‌క్ర‌మాల‌తో కాలం వెల్ల‌బుచ్చింది. ప‌క్క‌చాన‌ళ్ల‌లో వైసీపీ ప‌ని అయిపోయిందన్న రేంజ్‌లో క‌థ‌నాలు ప్ర‌సారం అవుతుంటే వైసీపీ శ్రేణులు ఉలిక్కిప‌డ్డాయి. ఒక‌ర‌కంగా వైసీపీని అభిమానించేవారంతా బెదిరిపోయారు. వెంట‌నే ధైర్యం కోసం, అస‌లేం జ‌రుగుతోందో తెలుసుకునేందుకు చాలా మంది సాక్షి చాన‌ల్‌కు మారారు. కానీ ధైర్యం నింపే సంగతేమో గానీ అస‌లు ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌కు సంబంధించిన వార్త‌లే సాక్షిలో లేవు. క‌నీసం స్ర్కోలింగ్ కూడా లేదు. స‌రే భూమా పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తే దానికి మ‌రింత ప్ర‌చారం క‌లిగించిన‌ట్టే అవుతుంది కాబ‌ట్టి సాక్షి మౌనంగా ఉంది అనుకునేందుకు లేదు. ఎందుకంటే మిగిలిన 15 చాన‌ళ్లు అప్పటికే ఈ విషయం ప్రపంచానికంతా తెలిసిపోయేలా చేశాయి. కాబ‌ట్టి భూమా ఎపిసోడ్‌కు ప్ర‌చారం క‌లిగించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే సాక్షి మౌనంగా ఉందని చెప్పుకుంటే అంత‌కు మించి జోక్ ఉండ‌దు.

భూమానాగిరెడ్డి పార్టీ వీడుతారా లేద అన్న దానిపై ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఆయ‌న సంగ‌తి వ‌దిలేస్తే 15 చాన‌ళ్లు వైసీపీ టార్గెట్ చేయ‌గానే క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చి పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. కానీ ఎస్వీ మోహ‌న్ రెడ్డి పార్టీ మార‌డం లేదని చెప్పిన విష‌యాన్ని శుక్ర‌వారం రోజు క‌నీసం ఒక్క‌సారి కూడా సాక్షి ప్రసారం చేయలేదు. క‌నీసం స్క్రోలింగ్‌లో కూడా వేయ‌లేదు. మిగిలిన ఎమ్మెల్యేల చేత కూడా పార్టీ ఫిరాయింపు వార్త‌ల‌ను ఖండించేలా పార్టీ నాయకత్వం కూడా చర్యలు చేపట్టినట్టు కనిపించలేదు. శుక్ర‌వారం రోజంతా టీడీపీ అనుకూల మీడియాదే పైచేయి. గంట‌ల త‌ర‌బ‌డి టీడీపీ అనుకూల మీడియా వైసీపీ సంక్షోభంలోకి వెళ్తోంద‌ని ప్ర‌చారం సాగించింది. కానీ ఇటు సాక్షి నుంచి గానీ, పార్టీ నాయ‌క‌త్వం నుంచి గానీ ఉలుకుప‌లుకు లేక‌పోవ‌డంతో వైసీపీ శ్రేణులు కూడా నిజ‌మే కాబోలు పార్టీలో జ‌ర‌గ‌కూడ‌నిది ఏదో జ‌రిగిపోతోంద‌ని భావించాయి.

శ‌నివారం క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి తాము వైసీపీని వీడుతున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ప్ర‌క‌టించినా… అప్ప‌టికే కొద్దిమేర న‌ష్టం జ‌రిగిపోయింది. ముందురోజు ఏదో జ‌రిగింది… కానీ బుజ్జ‌గించ‌డం వ‌ల్లే ఐదుగురు ఎమ్మెల్యేలు వెన‌క్కు త‌గ్గార‌న్న భావ‌న(బహుశా అది నిజమే అయి ఉండవచ్చు) అంద‌రిలోనూ క‌లిగింది. కానీ వైసీపీ పెద్ద‌లు కాస్త ముందుగానే స్పందించి… సాక్షి మీడియాను కూడా కాస్త ముందుగానే నిద్ర‌లేపి ఎదురుదాడి చేసి ఉంటే వ్య‌వ‌హారం మరోలా ఉండేది. సాక్షి ఎదురుదాడి మొదలుపెట్టి ఉంటే కరుడుగట్టిన టీడీపీ అనుకూల మీడియా కాకపోయినా మిగిలిన చానళ్లు అయినా కాస్త వెనక్కు తగ్గేవి.

స‌రే రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశం కాబ‌ట్టి వెంట‌నే ఎలా స్పందించాలో సాక్షిలో ప‌నిచేసే ఉద్యోగులకు అర్థం కాక‌పోయి ఉండ‌వ‌చ్చు. కానీ గంట కాదు రెండు గంట‌లు కాదు. శుక్రవారం రోజంతా సాక్షి మౌనంగానే ఉంది. ఇలా జరిగిందంటే సాక్షికి వైసీపీకి మ‌ధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయినా ఉండి ఉండాలి. లేకుంటే స‌బ్జెట్‌పై ప‌ట్టు రావ‌డానికి 24 గంట‌లైనా ప‌ట్టి ఉండాలి. లేకుంటే అన‌వ‌స‌రంగా ఆలోచించి బుర్ర‌పాడుచేసుకోవ‌డం ఎందుకు… పీవీగారు చెప్పిన‌ట్టు ”మౌనం కూడా వ్యూహ‌మే” అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయితే స‌రిపోదా అని అయినా ఆలోచించి ఉండాలి.

మొత్తం మీద భూమా ఎపిసోడ్ స‌మ‌యంలో సాక్షి మీడియా నిద్ర‌పోయిన తీరు( పార్టీ పెద్ద‌ల ఆదేశంతోనే ఇలా చేశారో ఏమో మ‌న‌కు తెలియ‌దు) మాత్రం స‌గ‌టు వైసీపీ అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది. తమకు కాసింత ధైర్యం నింపుతుందనుకున్న జగన్ ఫ్యాన్స్ భూమా ఎపిసోడ్ పై సాక్షి నుంచి ఏమీ ఆశించలేమన్న నిర్దారణకు వచ్చేశారు ఆఖరికి. కాసింత ఎదురుదాడి చేసే తత్వాన్ని కూడా సాక్షికి ఎక్కించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News