అతి నిద్ర… మన అంతు చూస్తుందట!
నిద్ర గుండెకు మేలు చేస్తుంది. అలాగే హానీ చేస్తుంది. అదెలాగో తెలిపే వివరాలివి- గుండెని కాపాడుకోవడం అంటే ప్రాణరక్షణలో మొదటి అడుగు వేసినట్టే. గుండె నిరంతరం అలుపులేకుండా తన పనితాను చేస్తుంది. కానీ మనం దానికే పరీక్షలు పెడుతున్నాం. మనిషి ఆరోగ్యానికి అవసరమైన కనీస అవసరాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. సరిపడా డబ్బు సంపాదించాలనే ఆరాటంలో, పోరాటంలో పడిపోయి ఆహారం, నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, మనశ్శాంతి ఇవేమీ శరీరానికి సరిపడా అందించడం లేదు. అందుకే జబ్బులు పెరుగుతున్నాయి. […]
నిద్ర గుండెకు మేలు చేస్తుంది. అలాగే హానీ చేస్తుంది. అదెలాగో తెలిపే వివరాలివి-
గుండెని కాపాడుకోవడం అంటే ప్రాణరక్షణలో మొదటి అడుగు వేసినట్టే. గుండె నిరంతరం అలుపులేకుండా తన పనితాను చేస్తుంది. కానీ మనం దానికే పరీక్షలు పెడుతున్నాం. మనిషి ఆరోగ్యానికి అవసరమైన కనీస అవసరాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. సరిపడా డబ్బు సంపాదించాలనే ఆరాటంలో, పోరాటంలో పడిపోయి ఆహారం, నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, మనశ్శాంతి ఇవేమీ శరీరానికి సరిపడా అందించడం లేదు. అందుకే జబ్బులు పెరుగుతున్నాయి. అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి.
న్యూయార్క్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో గుండెపోటుని నివారించే మార్గాలున్నాయని తేలింది. తగినంత నిద్ర, వ్యాయామం ఇవే ఆ మార్గాలని ఆ పరిశోధకులు చెబుతున్నారు. అయితే తగినంత అంటే ఎంత…నిద్ర మరీ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. సగటున మనిషికి ఏడునుండి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర కావాలి. అలాగే 30 నుండి 60 నిముషాల చొప్పున వారానికి మూడునుండి ఆరుసార్లు వ్యాయామం చేయాలి. ఈ రెండూ వయసు పైబడుతున్న వారిలో గుండె పోటుని సమర్ధవంతంగా ఆపుతాయని అధ్యయనంలో తేలింది. రాత్రులు ఏడునుండి ఎనిమిది గంటలు నిద్రపోయే వారిలో గుండెపోటు ప్రమాదం 25 శాతం తగ్గుతుందని తేలింది. అయితే ఎనిమిది గంటలు దాటి నిద్రపోతే మాత్రం స్ట్రోక్ వచ్చే ప్రమాదం 146శాతం పెరుగుతుందట.
అలాగే ఏడుగంటల కంటే తక్కువగా నిద్రించే వారిలో ఈ ప్రమాదం 22 శాతం వరకు పెరుగుతుంది. అంటే అతి నిద్ర మరింతగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. 2004నుండి 2013 వరకు 2,88,888మంది మీద ఈ పరిశోధనలు నిర్వహించారు. వీరంతా 45, అంతకుమించి వయసు పైబడినవారే. వారి ఆరోగ్యం, జీవన శైలికి సంబంధించి పలు అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో పరిశోధకులు నిద్రాపరమైన అంశాలతో పాటు ఈత, నడక, సైక్లింగ్, తోటపని లాంటివి కూడా గుండెపోటు రిస్క్‌ని ఎంత వరకు తగ్గిస్తాయో చూశారు. ఈ అధ్యయన ఫలితాలను అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్, అమెరికాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2016లో వెల్లడించింది.