ఈమె ఆ కలెక్టరమ్మ!
సెల్పీ దిగాలనిపిస్తే స్నేహితుడితో దిగు… ఇంకాస్త రిస్కయినా పర్వాలేదనుకుంటే జూ కెళ్లి పులితో దిగు. అంతే కానీ కలెక్టరమ్మతో కాదు!. ఇప్పుడు సెల్పీ గురించి సోషల్ మీడియాలో పంచ్ డైలాగ్. ఇంతకూ ఈ డైలాగ్ పుట్టడానికి కారణం ఎవరంటే?. ఒక లేడి కలెక్టర్, ఒక 18 ఏళ్ల యువకుడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షార్ జిల్లా మెజిస్ట్రేట్ అయిన చంద్రకళ తన కార్యాలయంలో అక్కడికి వచ్చిన జనంతో స్థానికవిషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇతరులతో కలిసి ఏదో పనిమీద అక్కడకు […]
సెల్పీ దిగాలనిపిస్తే స్నేహితుడితో దిగు… ఇంకాస్త రిస్కయినా పర్వాలేదనుకుంటే జూ కెళ్లి పులితో దిగు. అంతే కానీ కలెక్టరమ్మతో కాదు!. ఇప్పుడు సెల్పీ గురించి సోషల్ మీడియాలో పంచ్ డైలాగ్. ఇంతకూ ఈ డైలాగ్ పుట్టడానికి కారణం ఎవరంటే?. ఒక లేడి కలెక్టర్, ఒక 18 ఏళ్ల యువకుడు.
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షార్ జిల్లా మెజిస్ట్రేట్ అయిన చంద్రకళ తన కార్యాలయంలో అక్కడికి వచ్చిన జనంతో స్థానికవిషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇతరులతో కలిసి ఏదో పనిమీద అక్కడకు వచ్చిన 18 ఏళ్ల ఫరాజ్ అహ్మద్ చంద్రకళకు దగ్గరగా వచ్చి తన ఫోన్లో ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు అతడిని హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదు. పైగా ఫొటోలు తీసిందే కాక వాటిని డిలీట్ చేయమన్న అధికారులతో గొడవ పెట్టుకున్నాడు. నేను చేయను… అంటూ మొరాయించాడు. పోలీసులు చెబుతున్నా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన పోలీసులు అతడిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 కింద అరెస్టు చేసి జైలుకి పంపారు.
తామెంత చెబుతున్నా వినకుండా ఫొటో బాగా రావాలనే అత్యుత్సాహంతో తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని అక్కడి అధికారులు తెలిపారు. దీనిపై స్పందిస్తూ చంద్రకళ, తాను జిల్లా మెజిస్ట్రేటే కాక ఒక మహిళనని, ఎవరైనా సరే మహిళల మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని అన్నారు. మహిళలు స్వేచ్ఛగా పనిచేసుకునే హక్కుకి ఎవరూ ఆటంకం కలిగించకూడదని, నేటి యువతరానికి దేశం పట్ల ఎంతో బాధ్యత ఉందని, దాన్ని గుర్తించాలని అన్నారు. అతను ఫొటో తీయడమే కాక, వాటిని డిలీట్ చేయమన్నపుడు గొడవ పెట్టుకోవడం వల్లనే అరెస్టు చేయాల్సివచ్చిందని ఆమె పేర్కొన్నారు. సోమవారం అరెస్టయిన ఫరాజ్ అహ్మద్, అతని తల్లిదండ్రులు వచ్చి చంద్రకళని బ్రతిమలాడి ఒప్పించడంతో గురువారం బెయిల్‌మీద విడుదలయ్యాడు. చంద్రకళ నిజాయితీ కలిగిన అధికారిణిగా ఇప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన నిజాయితీ, ట్రాన్స్‌ఫర్లతో ఆమె తరచుగా వార్తల్లో కనిపిస్తున్నారు.