కలకలం సృష్టిస్తున్నజగన్ లేఖ
శాసనసభ శీతాకాల సమావేశాల్లో రోజా సస్పెన్షన్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. స్పీకర్ అధికారాలు, సభ బిజినెస్ రూల్స్ పరిధిపై చర్చకు ఇది దారితీసింది. అంతేకాదు చట్టసభలకు- న్యాయవ్యవస్థకు మధ్య వివాదంగా కూడా ఇది మారే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి రాసిన లేఖ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగానే అర్ధమౌతోంది. తన లేఖలో జగన్ అనేక అంశాలను స్పృశించారు. స్పీకర్ అధికారాల పరిధిని ప్రస్తావించారు. సభ […]
Advertisement
శాసనసభ శీతాకాల సమావేశాల్లో రోజా సస్పెన్షన్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. స్పీకర్ అధికారాలు, సభ బిజినెస్ రూల్స్ పరిధిపై చర్చకు ఇది దారితీసింది. అంతేకాదు చట్టసభలకు- న్యాయవ్యవస్థకు మధ్య వివాదంగా కూడా ఇది మారే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి రాసిన లేఖ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగానే అర్ధమౌతోంది. తన లేఖలో జగన్ అనేక అంశాలను స్పృశించారు. స్పీకర్ అధికారాల పరిధిని ప్రస్తావించారు. సభ బిజినెస్ రూల్స్‌లోని 340 నిబంధన కింద రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కానీ ఆ రూల్ కింద ఏ సభ్యుడినైనా ఆ సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయగలిగే అవకాశముంది. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రస్తావిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. గత ఏడాది లోక్‌సభలో పెప్పర్ స్ర్పే ఘటన సందర్భంలో ఎంపీలను ఆ సెషన్‌కు మాత్రమే సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా జగన్ వివరించారు. లోక్‌సభలో, శాసనసభల్లోని బిజినెస్ రూల్స్ ఒకే విధంగా ఉన్న సంగతిని కూడా ఆయన ఏకరువు పెట్టారు.
ఇక శాసనసభే సుప్రీం అని, దాని నిర్వహణ తీరును గానీ, నిర్ణయాలను గానీ న్యాయస్థానాల్లో ప్రశ్నించే అవకాశం ఎంతమాత్రమూ లేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ గతంలో అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు చట్టసభల వ్యవహారాలపై తీర్పు ఇచ్చిన విషయాన్ని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. అలాంటి పరిస్థితే మరోమారు తలెత్తితే శాసనసభ గౌరవం పోతుందని ఆయన హెచ్చరించారు. అంటే తాము న్యాయస్థానాల తలుపు తట్టనున్నామని ఆయన పరోక్షంగా సూచించారు.
ఈ వ్యవహారంపై స్పీకర్ వేసిన సభా సంఘం ఈనెల 18న సమావేశమౌతున్నది. ఆ నేపథ్యంలోనే జగన్ స్పీకర్‌కు ఈ లేఖ ద్వారా మరో హెచ్చరిక పంపారని అర్ధం చేసుకోవాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దాలని, రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని జగన్ తన లేఖలో కోరారు. లేదంటే ఈ వ్యవహారం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదానికి అధికారపక్షం ఎలాంటి ముగింపు ఇస్తుందనేది సభాసంఘం విచారణ తర్వాత గానీ తేలదు.
Advertisement