మీ వంటింట్లో పోపుల పెట్టె విషతుల్యం
మీ ఇంట్లో నిత్యం మసాలాలు, జిలకర, గసగసాలు ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఉప్పు, పప్పు, ఆయిల్ ఇలా అన్నీ కల్తీ చేసేస్తున్నారు కంత్రీగాళ్లు. అవును మీ వంటింట్లో ఉపయోగించే పోపుల డబ్బా కూడా ఇప్పుడు విషమయం అవుతోంది. కల్తీ ఎలా చేస్తున్నారన్నది తెలిస్తే వంటల్లో మసాలా దినుసులు వేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. నకిలీ మసాల దినుసుల కల్తీ దందాపై తెలంగాణ పోలీస్ వెబ్ సైట్‌కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన సౌత్ జోన్ పోలీసులు హైదరాబాద్ […]
మీ ఇంట్లో నిత్యం మసాలాలు, జిలకర, గసగసాలు ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఉప్పు, పప్పు, ఆయిల్ ఇలా అన్నీ కల్తీ చేసేస్తున్నారు కంత్రీగాళ్లు. అవును మీ వంటింట్లో ఉపయోగించే పోపుల డబ్బా కూడా ఇప్పుడు విషమయం అవుతోంది. కల్తీ ఎలా చేస్తున్నారన్నది తెలిస్తే వంటల్లో మసాలా దినుసులు వేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది.
నకిలీ మసాల దినుసుల కల్తీ దందాపై తెలంగాణ పోలీస్ వెబ్ సైట్‌కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన సౌత్ జోన్ పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలోని ఓ గోదాంలో ఈ కల్తీ మసాల తయారీ అడ్డాను గుర్తించారు. గోదాములపై దాడులు చేసి వెయ్యికి పైగా బస్తాలను సీజ్ చేశారు. 15మందిని అరెస్ట్ చేశారు. ఓపీ ట్రేడర్స్, రాయ్ పూర్ హనుమాన్ ట్రేడర్స్ తో పాటు బేగం బజార్ లో పదకొండు హోల్ సేల్ షాపులకు నకిలీ మసాలా దినుసులు సరఫరా అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజేశ్ గుప్తాను ఈ దందాకు కారకుడిగా గుర్తించారు.
నెలకు 60 వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ 8నెలలుగా ఇక్కడ మసాలా దినుసుల తయారీ సాగుతోంది. మిరియాలు, గసగసాలు, ఆవాలు, జిలకర వంటి మసాలా దినుసులను కల్తీ చేసేందుకు పెయింట్, ఐరన్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్ , బ్లాక్ ఆక్సైడ్, పటికతోపాటు పలు రసాయనాలను వాడుతున్నారు. వందల కొద్దీ బస్తాలు, వాటిని మిక్స్ చేసే మిషనరీని పోలీసులు సీజ్ చేశారు. బొప్పాయి గింజలకు బ్లాక్ ఆక్సైడ్, మరికొన్ని కెమికల్స్ కలిపి వాటిని మిరియాల్లో కలుపుతున్నారు. గసగసాలకు బొంబాయి రవ్వతోపాటు మైదా, పెయింట్, రసాయనాలు కలుపుతున్నారు. జీలకర్రకు చీపుర్లలో ఉండే వేస్ట్ మెటీరియల్‌ను మిక్స్ చేసి తయారు చేస్తున్నారు.
కల్తీ చేసిన మసాలా దినుసులు తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులతో పాటు.. నాడి, జీర్ణ వ్యవస్ధ క్రమంగా దెబ్బతింటుందని.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు అంటున్నారు. మరోవైపు ఈ మసాలా దినుసులు ఇప్పటికే ఎంత మంది ఇళ్లలోకి చేరాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.