ముంచుకొస్తున్న మధుమేహం ముప్పు
రాబోయే రోజుల్లో మధుమేహం అభివృద్ధి చెందుతున్న దేశాలను వణికించబోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనకూ ఆ ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు యువభారతం అని చెప్పుకుంటున్న మనం ఇక ముందు మధుమేహ భారతం అని చెప్పుకోవాల్సి ఉంటుందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పిల్లల్లో పెరుగుతున్న షుగర్ లెవల్స్ చూస్తుంటే ఇవన్నీ అతిశయోక్తులు కాదని, నిజాలని అర్ధమవుతుంది. మనదేశంలో 66.11శాతం మంది పిల్లల్లో అసాధారణ స్థాయిలో షుగర్ లెవల్స్ ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. ఎస్ఆరెల్ డయాగ్నొస్టిక్స్ నిర్వహించిన […]
రాబోయే రోజుల్లో మధుమేహం అభివృద్ధి చెందుతున్న దేశాలను వణికించబోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనకూ ఆ ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు యువభారతం అని చెప్పుకుంటున్న మనం ఇక ముందు మధుమేహ భారతం అని చెప్పుకోవాల్సి ఉంటుందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పిల్లల్లో పెరుగుతున్న షుగర్ లెవల్స్ చూస్తుంటే ఇవన్నీ అతిశయోక్తులు కాదని, నిజాలని అర్ధమవుతుంది.
మనదేశంలో 66.11శాతం మంది పిల్లల్లో అసాధారణ స్థాయిలో షుగర్ లెవల్స్ ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. ఎస్ఆరెల్ డయాగ్నొస్టిక్స్ నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలిన నిజాలు దేశ భవిష్యత్తుకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధుమేహం ఇంతగా విజృంభించడానికి ప్రధాన కారణం లైఫ్‌స్టయిల్లో వస్తున్న మార్పులే. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, పిల్లల జీవితాలనుండి క్రీడలు కనుమరుగైపోవడం…ఇందుకు కారణాలుగా వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఎస్ఆరెల్ డయాగ్నొస్టిక్స్ చైన్ సంస్థలు మూడేళ్ల కాలంలో నిర్వహించిన హెచ్‌బిఎ1సి పరీక్షల్లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. దాదాపు 17వేలమంది పిల్లల షుగర్‌టెస్ట్ ఫలితాలను ఇందుకోసం సమీక్షించారు. ఇందులో తేలిన మరొక నిజం ఈ పిల్లల్లో 51.76 శాతం మంది మగపిల్లలున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను హెచ్చరిస్తోంది. 2025నాటికి మధుమేహంతో బాధపడే వారిలో 80శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలవారే అయి ఉంటారని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. 2012లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మరణాలు డయాబెటిస్ అనుబంధ సమస్యల వల్లనే సంభవించినట్టుగా లెక్కలు చెబుతుంటే అందులో 80శాతం మృతులు వెనుకబడిన దేశాలవారే అని తేలింది. 2030నాటికి మధుమేహం ప్రపంచంలోనే మరణాలకు కారణమయ్యే ప్రమాదకరమైన అంశాల్లో ఏడవ స్థానంలో ఉండబోతోంది. ఇవన్నీ చూస్తుంటే పిల్లల భవిష్యత్తుకి మనం చదువు, ఉద్యోగాలు, సంపాదన…వీటన్నింటికంటే ముందు ఆరోగ్యాన్ని అందించాలని అర్థమవుతోంది కదా!