రామాయణానికి అక్షరాంజలి సమర్పించిన... పూసపాటి పరమేశ్వరరాజు
”వాన వచ్చింది. ప్రకృతి వెల్లివిరిసింది. ఇంద్రచాపం శోభాయమానంగా తన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇటువంటి సమయంలో జపనీయుడెవడైనా ఇంట్లో ఉండగలడా? బయటకు వెళ్ళి, ప్రకృతి ఒడిలో కలం పట్టుకుని హైకూలు వ్రాస్తాడు, లేదా కుంచెపట్టుకుని చిత్రాలు వేస్తాడు” అని అంటాడొక కవి. ఇది జపనీయుల సౌందర్యకాంక్షను వెల్లడిస్తుంది. వారు అంతగా సౌందర్య దాసులు కావడానికి వారి భాష కొంత వరకూ కారణం. క్షరము కానిది అక్షరము. ఆ అక్షరమే ప్రస్తుతం లిపిగా ధ్వనికి సంకేతంగా వాడబడుతుంది. ఇది ప్రపంచంలోని […]
”వాన వచ్చింది. ప్రకృతి వెల్లివిరిసింది. ఇంద్రచాపం శోభాయమానంగా తన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇటువంటి సమయంలో జపనీయుడెవడైనా ఇంట్లో ఉండగలడా? బయటకు వెళ్ళి, ప్రకృతి ఒడిలో కలం పట్టుకుని హైకూలు వ్రాస్తాడు, లేదా కుంచెపట్టుకుని చిత్రాలు వేస్తాడు” అని అంటాడొక కవి. ఇది జపనీయుల సౌందర్యకాంక్షను వెల్లడిస్తుంది. వారు అంతగా సౌందర్య దాసులు కావడానికి వారి భాష కొంత వరకూ కారణం.
క్షరము కానిది అక్షరము. ఆ అక్షరమే ప్రస్తుతం లిపిగా ధ్వనికి సంకేతంగా వాడబడుతుంది. ఇది ప్రపంచంలోని కొన్ని భాషలకు మాత్రమే వర్తిస్తుంది. జపాను, చైనా భాషలకు వర్తించదు. చైనా, జపాన్ భాషలో అక్షరాల స్ధానాన్ని పదాలు ఆక్రమిస్తాయి. ఈ పదాలు, అక్షర సమూహాలు, ఈ పద సంకేతాలు చిత్రాలనుంచి వచ్చినవే. వీటిని వ్రాసే విధానం ఒక కళాత్మక వ్యాపకంగా సాగుతుంది. అందుచేతనే అక్కడ ‘లిపికళ’ కలిగ్రఫీ అనే పేరుతో రూపుదిద్దుకుంది.
ఈ కలిగ్రఫీలో అక్షరాలతో పాటు అందమైన రేఖా చిత్రాలనూ జమిలిగా వేయటం జరుగుతుంది. ఒక్కోసారి అక్షరాలు డిజైన్‌లో మమేకమవుతాయి. ఇది చిత్రకళలో ఒక ప్రత్యేకమైన శాఖగా శోభిల్లుతున్నా, దీనిలో కృషి చేసిన వారు చాలా తక్కువ. వారిలో ఎక్కువ మంది దీనిలోని అక్షర శోభకు మాత్రమే పరిమితమవుతున్నారు.
కళకు సరిహద్దులు చెరిపి వేసి వాటిని మరింత ముందుకు తీసుకొని వెడుతూ, కలిగ్రఫీలోని దేవనాగరి లిపితో చిత్రకళను సంయమనం చేస్తూ తనదైన శైలిని వృద్ధి చేసినవారు విజయనగర వాస్తవ్యులు, రాజ బంధువయిన పూసపాటి పరమేశ్వరరాజు. వీరు 1961వ సంవత్సరములో జన్మించారు. తండ్రి పూసపాటి అప్పలరాజు. ఆయన వృత్తి రీత్యా డాక్టరు. భారతీయ మిలటరీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేశారు. తండ్రి మిలటరీ అధికారి కావటం వల్ల రాజుగారి బాల్యమంతా ఆంధ్ర రాష్ట్రానికి బయటే సాగింది. ఆయన తమిళనాడు, పుణేల నుంచి సైనిక స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని, తన అభిరుచిని అనుసరించి ఔరంగాబాదు లోని ప్రభుత్వ లలిత కళాశాలలో పట్టభద్రులైనారు (1980- 85). చిత్రకళలో కలిగ్రఫీ ఆయనకి ఇష్టమయిన విషయం. మనం ఇక్కడ చూస్తున్నది 25 సంవత్సరాల ఆయన స్వయం కృషి ఫలితం. ఈ కళకు ఉపయోగించబడే అన్నిరకాల పెన్నులు, ఇంకులు, ఇంగ్లండులోని Willson and Redd కంపెనీవి మాత్రమే ఆయన వాడతారు. ఈ పెన్ను పాళీలు చివర చదరంగా ఉంటూ వ్రాస్తున్నపుడు మణికట్టు చేతివేళ్ళ కదలికలతో ఒంపులు తిరుగుతూ, కొన్నిచోట్ల దళసరిగా, కొన్నిచోట్ల సన్నటి రేఖలుగా ఒకే స్ట్రోక్‌లో రూపుదిద్దుకుంటాయి. వీటిని గీస్తున్నపుడు చూడటం కూడా ఒక కళే. ఈ పాళీలో ఎడమవైపు సానబెట్టబడేవి, కుడివైపు సానబెట్టబడేవి, అని రెండు విధాలుగా ఉంటాయి.
(సప్తపర్ణి నుంచి)
– కాండ్రేగుల నాగేశ్వరరావు